పుట:Varavikrayamu -1921.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము

59


మగునపుడు, భర్తతో సహగమనము సలుపుట బలవన్మరణము కాక, పాతివ్రత్యమగునప్పుడు, అవమానమును, దప్పించుకొనుటకై ప్రాణములను విడుచుట ఆత్మారాధనముకాక ఆత్మహత్య యెట్లగును? కాదు ముమ్మాటికిని గాదు. ఈ త్యాగమువల్ల నాగౌరవము నాకు దక్కుటయెకాక తల్లిదండ్రుల ధననష్టము కూడఁదప్పును. (అని వ్రాఁతబల్లకడకుఁ బోయి యుత్తరము వ్రాసి మడిచి, బల్లపై నుంచి, లేచి) ఓ గదీ! నీకొక నమస్కారము! ఓ శయ్యాదులారా, మీకు సాష్టాంగ ప్రణామములు. (రాట్నముకడకుఁబోయి, ముద్దు పెట్టుకొని) నా ముద్దుల రాట్నమా! యింతటితో నీకును నాకును ఋణము సరి. గడియారపు ముండ్లవలె నీయాకులెప్పుడును గదులుచునే ఉండుగాక! నీ మధురగాన మెల్లప్పుడు నిఖిలదిసలయందును ధ్వనిఁచుచునే యుండుగాక! కడపటి సేవగా నిన్నొకసారి కదిపి మఱిపోయెద! (అని రాట్నము తిప్పి నూలుతీసి) ఈ బారెడు పోగును నాభక్తికి నిదర్శనంగాఁ ప్రపంచమున నుండుఁగాక! (అంతట తెర యెత్తగా పెరడును, బావియు గోచరించును.) అటునిటు జూచుచు, మెల్లగాఁ బెరటిలోని కరిగి) నాకంటె ముందు పుట్టిన నవమల్లికా! నమస్కారము. కమలయు నేనును గష్టపడి పెంచిన చేమంతులారా! మీకుఁజేమోడ్పు. (అనుచు బావికడకుఁబోయి) ఓ పరమేశ్వరా! ప్రయోజనార్థమై నీవు ప్రసాదించిన యీశరీరము నిట్లు బావిపాలు చేయుచున్నందులకు మన్నింపుము. ఓ తలిదండ్రులారా, నన్నుఁ గని పెంచినందులకు మీ కివిగో నా కడపటి వందనములు. కాళింది యను కూఁతును గననే లేదనుకొనుఁడు గాని, గర్భశోకముచేఁ గృశింపకుఁడు! భరతమాతా, ప్రణామములు. తల్లీ, నీవే నిర్భాగ్యస్థితిలో నుండునప్పుడు నీ తనయల కేమిదారి చూపగలవు? ఓ పాలకులారా మీ పన్నులగొడవయే మీది కాని, ఆపన్నులగు నాఁడుఁపడుచుల పన్నుల గొడవ మీకక్కఱలేదు. గదా! వంగరాష్ట్ర శిక్షాస్మృతులేకాని, వరశుల్క శిక్షాస్మృతులను గల్పింపరు గదా, ఓ సంఘ సంస్కర్తలారా! ఉపన్యాసవేదికలపై నూఁదర గొట్టుటయే గాని, మీరేకరు పెట్టు ధర్మములనైన మీరనుష్ఠింపరేమి? పాచినోటనె కాఫీ, ప్రాతఃకాలము కాఁగానే క్షౌరము, మై గుడ్డతో తిండి, మదరాసు కాఫీ