పుట:Varavikrayamu -1921.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

వరవిక్రయము

కమ :- సరే నీ యిష్టము! (అని నిష్క్రమించును.)

కాళిం :- హరహరా! ఆపది ఎకరములు విక్రయించి, అల్లునకుఁ జెల్లించుచుంటిరిగా గదా! ఆవల వీరిగతి యేమికావలసినది? మా ప్రాణముల కుసూరు మనుచు మలమల మాడవలసినదేనా? ఈ మాట వినికూడ నేనీ దుర్నయకార్యమున కెట్లు సిద్ధపడుదును దైవమా? యిందుల కేదియు దారి యగపఱుపవా? (స్మృతితో) అన్నట్లు దారికేమీ? అపురూపమైనదారి యాయోరుగంటి యువతి యగపఱిచియే యున్నది. ఆ దారిని నేను మాత్రమేల యనుసరింప గూడదు? ఈశ్వరాదేశమున కూడ నదియె కాకున్న ఈ పూటనె యావార్త యేల చెవిని బడవలెను? కమలయేమన్నది? "అట్టి సాహస మందఱకు నలవడుట యెక్క" డనియా? కాళిందీ? నీవీపాటి సాహసమునకుఁ గన్నులు మూసికొని సిద్ధపడలేవా? మానము కాపాడుకొనలేకున్న మానవతి యనిపించుకొనఁగలవా? చెఱుపునుండి మరలించినదే స్నేహము. పాపరహితమైనదే పని, పుణ్యమార్జించినదే బుద్ధి. అనుభవించినదే యైశ్వర్యము. స్వాతంత్ర్యము కలిగినదే జన్మము, మర్యాద గాపాడుకొన్నవాఁడే మగవాఁడు. మానము దక్కించుకొన్నదే మగువ. ఇప్పుడు తప్పిన నీవిక నెన్నఁడును జావకుండ బ్రతుక గలవా? ఏనాడు ప్రాణులు తల్లికడుపున, బడునో ఆనాడె మృత్యువు కూడ వెంటపడును. శిశువు పుట్టగానే ముందు మృత్యువు ముద్దుపెట్టుకొని తరువాత దాదికిఁఁ బలెఁ దల్లి కిచ్చును. అట్టి స్థితిలోఁ జావున కంత సందేహింపవలసిన పని యేమున్నది? లెమ్ము. లేచి నీ తలల్లిదండ్రులకొక లేఖవ్రాసి అవమానకరమైన నీయాడుబొంది నింతటితో విడిచిపెట్టుము. (అని దిగ్గునలేచి, గది తలుపు మూసి) అవునుగాని ఆత్మహత్య అపకీర్తికిని, అధోగతికిని గూడ గారణము కదా. అట్టిపని చేయవచ్చునా? (క్షణమాలోచించి) అయ్యో! నా మతికాల! నన్ను నేనేపొరపెట్టుకొనుచుంటి నేమి? బుస్సీ కంట పడనొల్లక బుగ్గియైన బొబ్బిలి వెలమ యాఁడువారి పోడిమి తగ్గినదా? రుస్తుంఖానుని వశమగుట కిష్టములేక, రుధిరాంబరంబులతో నగ్నింబడి రూపుమాసిన పెద్దాపుర క్షత్రియాంగనల పెంపు సన్నగిల్లినదా? ఆయుధముచే నరులం బరిమార్చుట హత్యకాక, వీర ధర్మ