పుట:Varavikrayamu -1921.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము

57


మీయలేక, అన్య సంబంధమును సిద్ధపఱిచిరి. ఆయువతి ఆ యువకుం దక్క నన్యుని బెండ్లియాడుట కిష్టము లేక యారాత్రి విషపానముచేసి మరణించెను! ఈ వరశుల్కములు ఫలితమింతవఱకు వచ్చినది."

కాళిం :- సెబాసు! చాల చక్కనిపని చేసినది!

గీ. పుట్టినపుడె లిఖియించు గిట్టు మనుచు
   సకల జీవుల నొసట జలజభవుఁడు,
   ఇట్టిచో నంతరాత్మ స హింపని పని
   కొడఁ బడుటకంటె జచ్చుటే యుత్తమంబు.

కమ :- అట్టిసాహస మందఱకు నలపడుట యెక్కడ? కాని అమ్మ యన్నమునకుఁ బిలుచుచున్నది పోవుదము రమ్ము.

కాళిం :- నాకింకను నాఁకలి యగుటలేదు. నీవుపోయి భుజింపుము.

కమ :- అయ్యో! నీయాకలి అక్షయముకాను! ఇప్పుడెంత ప్రొద్దుపోయినదో యెఱుగుదువా? నాన్నగారు భోజనముచేసి, నారాయణ దాసుగారి హరికథలోనికి వెళ్ళినారు. అమ్మ మనకొఱకట్టె యున్నది.

కాళిం :- సరే కాని, యొక్క మాట, ఇంటనిప్పుడు సొమ్మేమియులేదు గదా, యీ కట్నపుసొమ్మెట్లు వచ్చినదో నీకేమైన తెలియునా?

కమ :- పోతునూరులోని పొల మమ్మివేసినారు.

కాళిం :- శ్రీరామ రామా! చివర కిదికూడనా?

కమ :- ఏమి చేయమనెదవు? ఈ దినములలో బిడ్డలం బడయుట యిందులకుఁ గాక మరెందులకనే నీ యభిప్రాయము?

ఆ. కొడుకు పుట్టి చదువు కొఱకుఁ దాతలనాఁటి
    మడులు మాన్యములును దుడిచివేయఁ
    గూఁతు రవతరించి కొంపలుం గోడు ల
    మ్మించుచుండె బెండ్లి లంచములకు.

కాళిం :- నిజమే! నిజమే! అదిగో అమ్మ పిలుచుచున్నది. వెళ్ళు.

కమ : -నీవు కూడ రమ్ము.

కాళిం :- నా కాకలి లేదని చెప్పలేదా? తలకూడా నొచ్చుచున్నది. తక్షణమే పండుకొనినగాని తగ్గదు. (అని తివాచిపైఁ గూలఁబడును.)