పంచమాంకము
ప్రదేశము: కాళిందీ కమలల గది.
కాళిం :- (విచారముతో బచారుచేయుచు) కటకటా! కట్నము కాళ్ళకడకుఁ బంపుట కూడ జరుగునపు డిఁక కార్యమేమున్నది?
ఉ. తెల్లముగా మనోగతము తెల్పినఁ నేడ్చిన, మొత్తుకొన్న, నా
తల్లికిఁ దోఁచదాయె విది తప్పిదపుం బని యంచుం దండ్రియుం
జల్లగ గ్రిందిమెట్టునకు జారి ననుం గమనింపఁ డాయె! నన్
జెల్లని డబ్బు క్రింద నిటు చేసితి వేమిటి కయ్య దైవమా!
ఔరా! ఆఁడుదానిబ్రతు కెంత యలసుబ్రతు కైనది!
ఉ. లేదు స్వతంత్ర మొక్క లవలేశము కూడ, నొకింతయేనియున్
లేదు యధార్థ గౌరవము లేదొక యింతయు మెప్పు, పెండ్లియే
కాదు గృహంబు లమ్ముకొని కట్నము లర్పణ సేయకున్న నీ
మాదిరి నాఁడుపుట్టు నవ మానపుఁబుట్టువు క్రింద నేర్పడెన్.
ఇంతకునూ మూల మిప్పుడు నేను జేయవలసిన దేమిటి?
గీ. పయిక మాశించి దిగిన యబ్బాయి చేత
బొందు కట్టించుకొని తృప్తిఁ బొందఁ దగున?
తల్లిదండ్రుల నెదిరించి తగవు పెంచి
మొండికెత్తినయట్లు కూర్చుండఁ దగున?
కమ :- అక్కా! అక్కా! యీ యాశ్చర్యము విన్నావే. (అని యఱచుచు వార్తాపత్రిక చేతఁబట్టుకొని, చరచరఁ బ్రవేశించును.)
కాళిం :- ఏమిటది?
కమ :- ఇదిగో చదివెద వినుము. "ఓరుగల్లులో నొక యువతి యొక యువకుని వరించెను. ఆ యువకుఁ డారువేలు కట్నమిచ్చినఁ గాని యామెను బెండ్లి యాడనని నిరాకరించెను. ఆమె తలిదండ్రులా విత్త