పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


గుచు గోవిందరాజు సైనికులు చెల్లాచెదరగు నట్లొనరించెను. అది చూచి గోవిందరాజు రెట్టించిన క్రోధోద్రేకముతో రాయలపై గవిసెను. ఇరువురునుభయంకరముగ పోరాడుచున్న సమయమున రామకృష్ణుడుధైర్యముగ గోవిందరాజు వినునట్లీ క్రిందిపద్యములఁ జదివెను.

'క. బసవనకు బుట్టినప్పుడె
    పసరము గోవిందరాజు పసరంబైన౯
    గనవేటికి దినఁడనఁగాఁ
   గసవుందిను శత్రులాజిఁ గదిసినవేళన్. '

ఆ పద్యము నిశితశూలమువలె చిత్తమునకు దాకఁగాగోవిందరాజు వెంటనే రుధిరము నోటఁ గ్రక్కుకొని క్రిందబడి విలవిల దన్నుకొనుచుఁ బ్రాణములువిడిచెను. రామకృష్ణుని పద్యము విని గోవిందరాజు విగతజీవుఁడగుటతోడనే తక్కుంగల సైనికులు చెల్లాచెదరై పాఱిపోయిరి. రామకృష్ణుని మహిమ కెంతయు నలరి, 'రాయలు 'రామకృష్ణకవీ! నీమహాత్మ్య మేనెఱుంగనైతిని. ఈవిషయమున కీవు కారణభూతుఁడవు, నీ కేమి కావలయునో కోరుకొను' మనగా మన కవి యిట్లనెను-

‘మహారాజూ! నాపై తమకు దయయున్నఁ జాలును, నా కదియే పది వలు. తాము కోరుకొనమంటిరిగాన యొక చిన్నవరమడిగెదను. నేను చేయు తప్పులు దినమునకు నూఱింటివరకు క్షమించుచుండ గోరెదను. నాకఁతియే చాలును.

'నూరుకాదు ఎన్ని తప్పులైనను క్షమింతును.' అని రాయలు వచించెను. నాటినుండి రామకృష్ణుడు నిర్భయముగఁ గొంటెబనుల జేయుచుండెను.