పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

11


తెలతెలవారుచుండెను. ఒక దొంగ మఱల బావిలోనికిదిగి వెదకివెదకి మూటను పైకిదీసివిప్పెను. అందు రాళ్ళు కన్పింపగానే దొంగలు నిస్పృహచెంది. రామకృష్ణకవి తమకు తగిన ప్రాయశ్చిత్తమొనరించె నని వెడలిపోవునంతలో రామకృష్ణుడు ఓరీ! చోరులారా! మీ పుణ్యమా యని ఒకటిరెండు మొక్కలుదప్ప పూలమొక్కలన్నియుఁ దడిసినవి. మీధర్మమాయని యారెండు మొక్కలనుగూడ నను నంతలో దొంగలు గోడదుమికి పాఱిపోఁబోయిరి. సరిగా నావేళకామార్గముననే బోవుచున్న రక్షకభటులు చోరులను బంధించి మఱల కారాగారమునద్రోసిరి. రామకృష్ణు డీవృత్తాంతమును రాయలకు దెలిపి, యానందము కలిగించెనట.

6 నూరు తప్పులకు ఫర్మానా

రాయలు కొలఁదిపరివారము వెంటరా, కవిబృందముతోఁ గలసి వాహ్యాళికై భద్రానదినిదాఁటి చాలదూరమరిగెను. కనిగిరి పరిపాలకుఁడైన వీరభద్రగజపతి సేనానియగుపసరము గోవిందరాజను దండనాథుఁడు రాయలను బంధించుట కిదియే తగిన యదననియెంచి. ససైన్యముగ రాయల నెదుర్కొనెను. రాయల ననుసరించియున్న కొలఁదిమంది సైనికులును గోవిందరాజు ప్రతాపాగ్ని కోపఁజాలక పలాయన మవలంబించిరి. రాయలు ధైర్యముతో కవులవంకఁ జూచి ' కవీంద్రులారా ! ఈ విషమసమయమున వెనుకంజవేయరాదు. మీరు నాకు విజయము ప్రాప్తించునట్లాశీర్వదింపున, క్షణకాలములో గోవిందరాజును కృతాంతమందిరమున కతిథిగా నొనరించివత్తును' అని పలికి శత్రురంగమునకురికి యెచ్చట జూచినఁ దానెయై మెలం