పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


మమ్ము క్షమించి విడిచిపుచ్చుడు. తమరు మాకు చౌర్యమున గల గౌశలమును బరీక్షింపవచ్చును.

రాయలు 'సరే' మీరు నేఁటిరాత్రి రామకృష్ణకవి యింట నెవరికిని బ్రమాదము గలుగకుండ నేదైన యపహరించి గొనితెండు పట్టుబడినచో మీకు విముక్తి యింతలో లేదుగాని జయప్రదముగ చౌర్యమొనరించినచో మీకు విమోచనము గల్గింతును' అనెను. వల్లెయని యాచోరాగ్రేసరులు రాత్రి బాగుగా చీకటిపడిన పిదప రామకృష్ణకవి యింటిప్రహరీగోడ దాటి లోనబ్రవేశించి, చిక్కుడు పాదుక్రింద దాగొనియుండిరి.

రామకృష్ణకవి భోజనము చేయుటకు ముందు పాదప్రణాళనార్థము దొడ్డిలోనికి వెళ్ళి చిక్కుడుపాదుక్రింద నక్కియున్నదొంగలనుజూచి, లోనికివచ్చి భార్యనగలన్నింటిని భద్రముగ దాచి, భోజనానంతరము తిరిగి దొడ్డిలోనికి వెళ్ళి చేయి కడుగుకొనుచు బిగ్గరగా 'నేమే దొంగలు మనయూరునిండ నిండియున్నారు. నీనగలనుమూటగట్టి యిమ్ము. నూతిలో బారవేసినచో చోరులకు శక్యముకాదు" అని యొకటి రెండు పెద్దరాళ్ళను మూఁటగట్టి నూతిలో పడవైచి, తలుపువేసికొని, కొంతసేపైనతరువాత మరొక మార్గమున దొడ్డిలో, బ్రవేశించి, చోరులచేష్టల గనిపెట్టుచుండెను.

ఒకరు నూతికడ నిలువబడియుండగా, నింకొకడు బావిలోనికి దిగి చాలసేపు వెదకి యానగలమూటను కనుగొనజాలక పైకివచ్చి “ఓరన్నా! బావిలో జల మధికముగా యున్నది. కొంతయైన నీరు తోడివైచినగానిమూటకనబడుటదుర్లభము' అనెను, ఇరువురునుకలసి, ఏతముతోడుట కారంభించిరి. ఎంతతోడినను నీరు తరిగినట్లు గాన్పించకుండెను, రామకృష్ణుఁ డెట్టియలుకుడును జేయక మడులుత్రవ్వి యా దొంగలు తోడిననీరు పూలమొక్క లన్నింటిని దడుపునట్లు చేసెను.