పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

13


7 తాతాచార్యుల నవమానించుట

రాయలకు తాతాచార్యులవారియెడ నసమానమగు గౌరవము. రాయలమతగురువాయన. ఈతాతాచార్యులవారి జన్మస్థలము కాంచీపురము. ఈయన మహావిద్వాంసుడు. ఈయన విష్ణ్వంశ సంభూతుఁడని జనులు చెప్పుకొనెడి వారట. ఆచార్యులవారు సంస్కృతమున 'సాత్త్వికబ్రహ్మ విద్యావిలాస' మను గ్రంథమును రచించియుండిరి. చంద్రగిరిలోని వేంకటపతిరాయల సంస్థానమున కీయన తఱచుగా నేగుచుండుటచే రామకృష్ణునకు బరిచయుడయ్యెను తరువాత రాయలయాస్థానమున కేతెంచి విజయనగరముననే స్థిరనివాస మేర్పఱచుకొనెను. రామకృష్ణుడు తాతాచార్యుల వారిని దఱచుగా హేళనము చేయుచుండెను. వైష్ణవమత పక్షపాతియగు తాతాచార్యులవారు స్మార్తమతమునెడల నధికాసహ్యము కలిగి యుండెను. స్మార్తుల నాయన చూడ నొల్లకుండెను. స్మార్తులు కాన్పించినపుడు మొగము పై నుత్తరీయము గప్పుకొనుచుండెను. ఇది చూచి యందరు తాతాచార్యులవారు పరమఛాందసులని చెప్పుకొనసాగిరి. రాయలుకూడ యీవార్తను గర్ణాకర్ణికగ నాలకించి, రామకృష్ణునిరావించి 'తాతాచార్యులవారు ప్రజల యసూయకు బాల్పడుచున్నారు. ఎట్లయినను వారు ఛాందసము: వీడునట్లు చేయుమా' యనిరి.

రామకృష్ణు డట్లేయని యొకనాడు తాతాచార్యులవారు యింటికి వెళ్లెను. ఆసమయమునకే యాయన యీవలకు వచ్చెను. రామకృష్ణుని జూచి, యుత్తరీయము ముఖమున కడ్డు పెట్టుకొనెను. “స్వామీ! తాతాచార్యులవారూ! నేను దమ ప్రియ శిష్యుఁడను గదా! నన్ను జూచి మీరేల ముఖమున కుత్తరీయ మడ్డుపెట్టుకొనుచున్నారు!' లనియడుగ తాతాచార్యుల వారిట్లు సమాధానము జెప్పిరి –