పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

'రామకృష్ణా! నీవు నాకు ముఖ్యుఁడవుగాన నీతో నిజము చెప్పుచున్నాను. స్మార్తమతము బహు పాపిష్టిమతము. స్మార్తుని జూచిన వైష్ణవునకు మఱుజన్మమున గాడిద పుట్టుక యే సంప్రాప్తమగును గావున స్మార్తులఁజూచుట మానివైచితిని. రామకృష్ణు డప్పుడేమియు ననక యూరకుండెను. కొంతకాలము గడచిన వెనుక రాయలు కవులందఱితో గలిసి, నగరము వెలుపలనున్న యుద్యాన వనమునకు షికారువెళ్ళెను. ఉద్యానవనమునఁ జాలసేపు కూర్చుండి వారందఱు నీవలికి రాగా నచట కొన్నిగాడిదలు కాన్పించెను.

రామకృష్ణుడు ఒక్కొక్క గాడిదకడకు బోయి సాస్టాంగ దండప్రణామ మొనరింపసాగెను. రాయలును తదితరులును కడుపుబ్బునటుల నవ్వసాగిరి. రాయలు 'కృష్ణకవీ! నీకు మతిపోయినదా యేమి? ఎవరైనను గాడిదెలకు మ్రొక్కుదురా?' యనగా, రామకృష్ణుఁడు ప్రభువర్యా! నే నెన్నడు నర్థములేని పనిచేయను. ఈ గాడిద మన తాతాచార్యులగారి మేనమామ కందాళై తిరుచూర్ణాచార్యులుగారు. ఈ గాడిద మన యాచార్యులవారి తాతయగు పర్పటం అళహసింగరాచారిగారు. తక్కుంగల ఖరములన్నియు వీరి బంధువులే వైష్ణవమతాగ్రేసరులకు వీరికి మ్రొక్కి. నాయఘ వినాశమునకై ప్రయత్నించుటయే తప్పగునా? తాతాచార్యులవారు కూడ నీ మధ్య స్మార్తుల మొగము చూచుట మానినారుసుడీ యనెను.

తాతాచార్యులు సిగ్గుపడి యా దినము మొదలట్లు చేయుట మానెను. రామకృష్ణుని యుక్తికి సంతసింపనివారు లేరు.

8 సమస్యా పూరణము

భట్టుమూర్తియను నామాంతరముగల కాకమాని రామరాజుభూషణుఁడు రాయల యాస్థానములోనున్న యష్టదిగ్గజములలో నొకడు, రాయలు రామకృష్ణునియెడ నాదరాభిమానములు గలిగి