పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిత్రుల ప్రోత్సాహంతో, బారిష్టర్ పట్టా సంపాదించాలన్న దీక్షతో లండన్ బయలుదేరాడు. మద్యం, మాంసం, మగువ - ముట్టుకోనని తల్లి యెదుట ప్రతిజ్ఞ చేశాడు. అక్కడ స్వయంగా వంటచేసుకుని, శాకాహారిగా వుండి విద్యాభ్యాసం పూర్తి చేశాడు. లండన్ లోని ఇండియా సొసైటీలో సభ్యుడుగా చేరాడు. దాదాబాయ్ నౌరోజి బ్రిటీష్ పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసినపుడు ప్రకాశం చాలా చురుకుగా నౌరోజి విజయానికి కృషి చేశాడు. న్యాయవిద్యార్ధిగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ తో పాటు 50 పౌండ్ల బహుమతిని సంపాదించాడు.

బారిష్టరు పట్టా పుచ్చుకొన్న ప్రకాశం మద్రాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసు హైకోర్టులో తమిళ లాయర్లుగా భాష్యం అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్ ప్రసిద్ధులు. ఆంగ్లేయులైన నార్టన్, గ్రాంట్ అను లాయర్లు బాగా పేరుగాంచినవారు.

తన చదువుకోసం 20వేల అప్పుచేసిన ప్రకాశం చక్కని గ్రంథాలయం ఏర్పరచుకుని, కొన్ని నెలల్లోనే హైకోర్టు వకీలుగా మంచిపేరుతో పాటు, సంపాదన కూడా సాధించాడు. దినసరి ఆదాయం వందలనుండి వేలకు పెరిగింది. ఆత్మవిశ్వాసం, నిరంతర పరిశ్రమ, నిర్భీకత ఆయనకు పెట్టనికోటలు. మద్రాసునుండి వెలువడుతూ వుండిన 'లా టైమ్స్' పత్రికలో వ్యాసం వ్రాస్తూ, న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడు అని విమర్శించాడు. పదునాలుగేళ్ల బారిస్టర్ గా వుండి దాదాపు 15 లక్షలు సంపాదించాడు. బంధుమిత్రుల నెందరినో ఆదరించాడు. తనను బిడ్డలా పెంచిన నాయుడు గారి కుటుంబానికెన్నో విధాలుగా సహాయం చేశాడు. ఉదక మండలంలో రెండు బంగళాలు, మద్రాసులోని మాదాకోవెల వీథిలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంగల బంగళా, రాజమండ్రిలో, ఒంగోలులో పెద్దభవనాలు, గోదావరి డెల్టా క్రింద సుక్షేత్రాలైన భూములు సంపాదించాడు. తమ్ముళ్లు శ్రీరాములు, జానకీరామయ్యగార్లను బాగా చదివించాడు. శ్రీరాములుగారి కూతురే సినీనటి టంగుటూరి సూర్యకుమారి. భోగపురుషుడుగా ప్రసిద్ధుడయ్యాడు.

ప్రకాశం గారు జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అప్పటికి ఇంకా భారత రాజకీయ రంగంలో గాంధీజీ ప్రవేశింపలేదు.

1908లో ప్రముఖ జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ మద్రాసుకు వచ్చాడు. అతని సభకు అధ్యక్షత వహించుటకు ప్రముఖులు భయపడినారు. పిడుగులు కురిసినట్లు, వడగండ్ల వానలా చేసిన, బిపిన్ పాల్ గంభీరోపన్యాసం మద్రాసు ప్రజల్లో నూతన చైతన్యం కల్గించింది. ఆనాటి నుండి ప్రకాశం తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయసాగాడు.

జాతీయ భావాలను ప్రచారం చేయటానికి మద్రాసులో 'స్వరాజ్య' పత్రికను 1921 అక్టోబర్ 29న దినపత్రికగా ప్రారంభించారు. శ్రీయుతులు ఖాసా సుబ్బారావు, కోటంరాజు పున్నయ్య, జి.వి. కృపానిధి మున్నగు గొప్ప పాత్రికేయులు 'స్వరాజ్య' లో పనిచేశారు. తమిళులు స్థాపించిన 'హిందూ' పత్రిక 'స్వరాజ్య' ను తొక్కివేసేందుకు