పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతుకు తెరువు కోసం గోపాలకృష్ణయ్య కుటుంబంతో నాయుడుపేట చేరాడు. ప్రకాశం గారి పదకొండేళ్ల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి సుబ్బమ్మ ఆరుగురు పిల్లలతో కొంతకాలం వినోదరాయుడు పాలెంలో అన్నగారింట వుండి, తన పిల్లలను విద్యావంతులుగ పెంచాలని చదివింపసాగింది. పూటకూటిల్లు పెట్టడం సాటివారిలో తలవంపులు, ఆత్మగౌరవానికి భంగం. అయినా తన పిల్లల పురోభివృద్ధికై, సాహసించి ముందంజ వేసిన సాహస మాతృమూర్తి సుబ్బమ్మ.

1885లో ధార్వాడ నాటక కంపెనీ వారు ఒంగోలులో నాటకాలను ప్రదర్శించారు. నాటకాలంటే అమితమైన మోజుగల ప్రకాశం, రోజూ ఆ నాటకాలకు వెళ్లేవాడు. మిషన్ హైస్కూల్ ఉపాధ్యాయులైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు, ఉర్దూ భాషలో నాటకాలు వ్రాస్తున్న వుండవల్లి సాహెబ్ గారికి ప్రకాశం అంటే ఎంతో ప్రేమ. నాయుడుగారు ప్రకాశంను కన్నబిడ్డలా చూచుకొనే వారు. ప్రకాశం స్త్రీ పాత్రధారణలో మంచిపేరు సంపాదించారు.

తల్లి సంపాదన చాలినంతగా వుండేది కాదు. ప్రకాశం ధనవంతుల ఇళ్లలో వారాలు చేసుకుని చదువుకునేవాడు. మిడిల్ స్కూల్ పబ్లిక్ పరీక్ష ఫీజు కట్టేందుకు మూడు రూపాయలు కూడా పుట్టని కాలమది. బావగారిని నమ్ముకుని పాతికమైళ్ల దూరంలోని అద్దంకికి, పాదచారిగా వెళ్లి ఒట్టిచేతులతో తిరిగి వచ్చాడు. తల్లితో తన బాధను చెప్పుకున్నాడు. దొడ్డతల్లి సుబ్బమ్మ తన పట్టుచీర తాకట్టుపెట్టి, పైకం యిచ్చింది. ఆసారి పరీక్షలో ప్రకాశం అందరికంటే మిన్నగా పాసైయ్యాడు.

హనుమంతరావు నాయుడుగారు ప్రకాశంకు జీతంలేకుండా చేయించాడు. మిషన్ హైస్కూల్ లో ప్రి మెట్రిక్ లో చేరాడు ప్రకాశం. నాయుడుగారి చలువవల్ల చదువు సాగింది. గొప్ప న్యాయవాది కావాలన్న పట్టుదల ప్రకాశంలో పెరిగింది. నాయుడుగారు ఒంగోలులో వచ్చు వేతనం చాలదని రాజమండ్రి వెళ్లారు. అల్లరి ప్రకాశమును ఆంధ్రప్రకాశంగా రూపొందించిన మహనీయుడు నాయుడుగారు. రాజమండ్రిలో, ఎఫ్.ఎ. క్లాసులో చేర్పించారు. న్యాయశాస్త్రం చదవాలన్న కోరికను వెల్లడించాడు ప్రకాశం. తండ్రివంటి నాయుడుగారు, అప్పుచేసి ప్రకాశంను మద్రాసుకు పంపారు. మద్రాసు లా కాలేజీలో సెకండ్ గ్రేడ్ వకీలు పరీక్ష పాసై ఒంగోలులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. మరల నాయుడుగారిపై ప్రేమకొద్దీ రాజమండ్రి చేరాడు. కొద్దికాలంలోనే రాజమండ్రిలోని న్యాయవాదులకు పక్కలో బల్లెమయినాడు ప్రకాశం.

ఆంధ్రప్రాంతంలో ఏర్పాటైన మొదటి పురపాలక సంఘం రాజమండ్రి, ఆ సంఘంలోని సభ్యులందరూ భూస్వాములు, ధనవంతులు ప్రసిద్ధ న్యాయవాదులు. ప్రకాశం ప్రతిభాపాటవాలు వారికి బాధ కల్గించాయి. పలుకుబడి గల ప్రముఖులందరినీ చిత్తుచేసి ప్రకాశం రాజమండ్రి నగరపాలక సంఘం అధ్యక్షుడయ్యాడు. అప్పటికాతని వయస్సు ముప్పది అయిదేళ్ళు. నగరపాలనాన్ని న్యాయంగా, నిర్భయంగా సాగించి ప్రజల మన్ననలందుకున్నాడు.