పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

41


88

మదనజనకా ! మిమ్ము నే ధ్యానంబు సేయునెడ మీ యవయవ సౌందర్యంబు దలంప నేరకుండినను మీకు శతకోటి జన్మాధారమైన చక్కదనంబు దాఁచరాదు. మీ తిరుమేని కది సహజంబు. మీ పరాక్రమంబు నేఁ బొగడ నేరకుండినను శంఖచక్రాద్యాయుధంబులు భుజంబుల ధరియింపవలయుఁ గాని మానరాదు. మిమ్ము నే శృంగారింప నేరకుండినను మీ కిరీట కుండల పీతాంబరాభరణంబులు లోకాలంకారంబులు గాకపోవు. శ్రీదేవియు భూదేవియు మీ యుభయపార్శ్వంబుల నుండ నేను మీ కైంకర్యంబు సేయ సమర్ధుండఁ గాకుండినను అనంతగరుడ విష్వక్సేనాది పరివారంబులు మీ కొలువు సేయుదురు. ఇంక నప్రయత్నంబున మీ పేరు నుడివిన మీరు చనుదెంతురు. మీ వెంట నన్నియుఁ జనుదెంచును. మాకు బహువిచారంబుల నలయ నేల ? మిమ్ముఁ బేరుకొనుటే యన్నింటికి మూలము. నిత్యానుసంధానం బిందులనే కలిగె. శ్రీ వేంకటేశ్వరా !

89

ఈశ్వరేశ్వరా ! చదువం జూచిన సంశయంబులే పుంఖానుపుంఖంబులై తోఁచును. చదువ కూరకుండిన జ్ఞానంబు వొడమదు. మఱి నిన్నుఁ బలుదిక్కుల వెదకెదమని కన్నులం దెఱచిచూచిన లోకవ్యాపారంబులు భ్రమలం బెట్టెడిని. ఱెప్పలు మూసికొన్నను బలుచింతలు ముంచుకొనును. పుణ్యంబులు చేసియైన నిన్నుం గనియెద మనిన నవి బంధకంబయ్యెడిని. చేయకుండిన సర్వనా స్తికుండ నయ్యెద ; నీ యర్థంబొరులతోడ నే యోజించి చూచిన బహుకుతర్కములు వొదలెడి ; మానిన సర్వసిద్దాంతంబులు దెగవు. జగంబు బహుసందేహకారణంబు. తత్వం బేగతి నిశ్చయింపవచ్చు? కావున నేమి సేయంగా నేమి యగునో నీదాసులు వోయిన త్రోవ నడచి వారల యభిమానమునంబొదలి నీకు శర ణంటిని; నీవే వహించుకొని నన్నుం గాచెదవు. శ్రీవేంకటేశ్వరా!