పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



40

శ్రీ వేంకటేశ్వర వచనములు



86

సీతాపతీ ! మీ యాకారంబు కనులఁజూడ నెవ్వరి వశము ? మీ భక్తవాత్సల్యాది గుణంబులు దలంచుకొని కొంతదడవు జయ వెట్టి మీ కల్పించిన జగత్తు చూచి కొంతదడ వాశ్చర్యంబు నొంది నర్వమైనవారికి వరంబు లొసంగెడి మీ యుదారత్వంబు కొంతదడవు చింతించి మెచ్చి యహల్యా ద్రౌపదీ ప్రహ్లాదాదులకుఁ బ్రసన్ను లరైన మీ మహిమ కొంతదడవు దలపోసి పొగడి 'రావణకుంభకర్ల ముఖ్య దానవులఁ జెండాడిన మీ ప్రతాపంబు కొంతదడవు దలంచి విభీషణ హనుమత్ప్రభృతుల మన్నించిన మీకీ ర్తి కొంతదడవు పెద్దలచే విని మీకుఁ జేతులెత్తి మ్రొక్కి పరబ్రహ్మంబనై విలసిల్లు మీ ప్రభావంబు కొంతదడవు దలపోసి కొనియాడఁగలవారము. ఈరీతిం గాలక్షేపంబు చేయఁగా మీరు మాకుఁ బ్రత్యక్షంబై న ట్లుంటిరి. శ్రీ వేంకటేశ్వరా !

87

సర్వేశ్వరా ! అవధారు ; జగంబు నీ నాటకశాల; నేనెత్తిన తొలుజన్మంబులు నీముందర నాడెడి బహురూపంబులు; దారసుత బంధు జనంబులు మేళగాండ్రు; నిన్ను నుతించిన 'వేదశాస్త్ర పురాణంబులు తూర్యత్రయంబు. మాపాదప్రచారంబులు నాట్యంబు సేయు చేతలు ; ఆడెడిమాటలు క్రియాభాషాంగంబులు; భోగవస్తువులు మీరు మెచ్చి యిచ్చిన యీవులు ; ఈరీతి నెంతగాలంబు మీకు వేడుక యంతగాలంబు నాడెదము. మీ కొలువు నర్తకు లైనవారము మీకు వినోదము చేసికొని బ్రతుకవలయుఁగాని నెమ్మది మోక్షంబున నుండెద మనుట యే సంగతి ? మీర దయదలంచి కృపచేసిన నపు డయ్యెడుఁగాక, యెఱుక గల యేలికఁ గొల్చినవారికి నడుగ నేదిపని, ఇంక నన్నిట నన్నిట మన్నింపవే; శ్రీ వేంకటేశ్వరా !