పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



శ్రీ వేంకటేశ్వర వచనములు

39

నీ దర్శనంబు చూపి నా స్వతంత్రంబున నాతపో రాజ్యం బీడేర్పుము. నీ వెట్లు చేసిన నట్లౌను, నీవు నాలోపల నున్నాఁడవు. శ్రీ వేంకటేశ్వరా!

84

అధోక్షజా ! ఎవ్వనిరోమంబున నజాండకోట్లు వొడమె; నే మూర్తి నాభికమలంబున బ్రహ్మ జనించె; నే మహాదేవుని పేర " శ్రీమహా - విష్ణోరాజ్ఞయా ” యని మహాసంకల్పంబు చెల్లుచున్నది; ఏవస్తువుఁ బురాణపురుషుం డని చెప్పెదరు; ఏబలవంతుని దానవనై రి యండ్రు; ఏఘనుండు సముద్రంబుద్రచ్చి యమరుల కమృతంబు పంచి పెట్టె; నేపురుషునకు ప్రహ్లాద నారద వసిష్ఠాదులు దాసులు; ఏ ఘనునకు సూర్యచంద్రులు కన్నులు; లక్ష్మీపతి యెవ్వండు ; సర్వరక్షకుం డెవ్వండు; యజ్ఞ కర్త యెవ్వఁడు; యజ్ఞభోక్త యెవ్వండు, మోక్షం బియ్య గర్తయెవ్వండు; అతండవే నీవు. అట్టి నీకు ననంతనమస్కారములు సేసెద; చిత్తావధారు. శ్రీ వేంకటేశ్వరా !

85

యోగేశ్వరా ! పరమజ్ఞానులైనవారికిఁ గామ క్రోధ లోభ మోహమద మాత్సర్యంబు లడంగవలయు. అవి యెటువలె నుడుగ వచ్చు? ఎండ నుండిన యతండు నీడకుం బోవఁదలంచిన నదియె కోరిక యయ్యెడిని ; ఈగ తనమీఁద వ్రాలినఁ జోఁపుకోఁగణంగిన నదియే క్రోధం బయ్యెడిని. తన మంత్ర మొరులకుఁ జెప్పకుండిన నదియె లోభం బయ్యెడిని. పరులు దండంబు పెట్టిన వేళ దీవించిన నదియెమోహం బయ్యెడిని; భిక్షాన్నంబు భుజియించి తృప్తి బొందిన నదియె మదం బయ్యెడిని ; శిఖలోపలఁ బేలు దిరుగం గ్రోఁకికొనిన నదియె మాత్సర్యం బయ్యెడిని. ఈ ధర్మంబు లెల్లఁ దప్పకుండ నడపెద నని యెంచిచూచిన నావలన నన్నియుం దప్పులే; సర్వాపరాధంబులుం జేసి నీమఱుగుఁ జొచ్చితి నన్నుం గావవే; శ్రీ వేంకటేశ్వరా !