పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

39

గధరా ! తరులతా పాషాణాదులైన కొన్ని జీవశరీరంబులు నరపశుపక్షి మృగాదులైన కొన్ని జీవజంతువులకు నాహారంబులై యున్నవి. విచారించి చూచిన నెవ్వరి 'కెవ్వరు చుట్టము లయ్యెదరు? ఋణానుబంధంబునం దగిలినవారు పుత్రమిత్ర కళత్రాదులు; ప్రాకృతసుఖంబులకుఁ దోడైనవారలు వీరు. స్వామి ! జగదేక కుటుంబివి నీవు. మోక్షసుఖంబునకుం దోడైనవారు నీ దాసులు. ఇహపరలోకంబులకు సాధనంబులై న బంధువులు మీరు. మీ నామములు సకల దురిత నివారణములు; మియాయుధములు మాకు సర్వరక్షకములు; మీ పాదంబుల పై భక్తి మాకు వజ్రపంజరము; శ్రీ వేంకటేశ్వరా !

40

విష్ణుమూర్తీ! నేనెంతమూఢకఠినచిత్తుండనై న నీవు నామీఁదఁ గృపవెట్టిన సాత్త్వికుండ నగుదును ; అది యె ట్లంటివా ? ఱాతిమీఁదం గడువ వెట్టినం గుదురుగాదె ! కమరునం జవ్వాజి పూసినఁ బరిమళంబు పుట్టదే! చిల్కకుం జదువు చెప్పినఁ జదువనేరదే! అడవియిఱ్ఱికి వేట నేర్పినఁ బంపు సేయదే ! ఇట్టు గావున నీవు నామీఁద దయఁదలఁచి తల్లి బిడ్డలం బిలిచి యాహారంబు వెట్టునట్లు, యజమానుండు దన పనులం దోలి తెచ్చి యింటఁ బోషించినరీతి, నన్ను నీ చిత్తంబున దయఁదలచి నీకింకరునిగాఁ జేసికొనవే;శ్రీ వేంకటేశ్వరా !

41

గోవర్ధనోద్దారా ! నేను గరచరణాద్యవయవంబులు దాల్చి మాతృగర్భంబునందుండి వెడలి పెరిగి బుద్ది నెఱింగి యీజగంబులకుం గర్త యెవ్వండోకో యని వెదకి వెదకి పురాణంబులవలన నీవైభవంబులు విని నిన్నుం గనుంగొన శక్యంబుగాక యెవ్వండవోకొ యని విచారించి నిన్ను