పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు


37

సత్యసంకల్పా! ప్రపన్ను లైనవారికి మీదాసుల శ్రీపాదతీర్థంబు శిరసావహించుట సకల పుణ్యనదీస్నానములు; త్రికాలంబుల నాచార్యవందనంబులు సంధ్యావందనంబులు; అభ్యాగత శ్రీవైష్ణవుల నుపచరించిన వాక్యంబులు గాయత్రిమంత్ర జపంబులు; పూర్వాచార్యోక్త స్వరూపగ్రంథానుసంధానంబులు వేదసారాయణంబులు; జ్ఞానాగ్నియందుఁ గామక్రోధంబులనుసమిధల వేల్చుట యౌపాసనంబు, ఆర్తులైనవారికి శ్రీవైష్ణవమార్గంబు లుప శించుట లతిధిసత్కారంబులు; తాతముత్తాతలమాద్రి నుండుటే దేవ పితృ సంతర్పణంబులు; మీ తిరువారాధన సేయుటే సకలయజ్ఞంబులు చేయుట; వేదోక్తంబైన కర్మనియమంబులు ఫలంబులు నిలువలె సిద్దించె. నిదియ పరమార్థంబు. నిన్ గొల్వవచ్చు; పాపముంబట్టి నిర్దహింపవచ్చు; నిన్ను ముట్టి మెప్పింపవచ్చునే! శ్రీ వేంకటేశ్వరా!

38

నిగమగోచరా! నామనంబు ధ్యానయోగంబు సేయంగడంగినఁ జండాల గార్దభ సూకర కాంతలు తలఁపున బాఱెడిని. అంతట నది విడిచి పురాణంబులు చదువం జూచినఁ దాటకా శూర్పణఖా విరాధ కబంధ రావణ కుంభకర్ణాదినామంబులు నోటం దొరలెడిని. అది మాని జపంబు సేయంబూనిన నిద్రయు, నావులింతలు, నలసత్వంబులుఁ బొదలెడిని. అది చాలించి తీర్థయాత్రకు గుతూహలినైన దుష్ట చోర వ్యాఘ్ర మకరాదిభయంబులు వణఁకం జేసెడిని. ఈరీతుల నా ప్రయత్నంబు లెక్కడ కెక్కు. నేనొకటి దలంచిన వేఱొక్క చందంబున నీ మాయ భ్రమియింపుచున్నది. ఏ యుపాయంబున నిన్ను నావశము చేసికొనియెద? నా చందము నాకు బోధింపవే; నీవు జగద్గురుండవు; నా మర్మము నీచేత నున్నది; శ్రీ వేంకటేశ్వరా!