పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంక దేశ్వర వచనములు

పుణ్యనదులు నీ రాజ్యంబునకుఁ గట్టు కాలువలై యున్నవి; పుష్పఫలసమేతంబులు కాననంబులు నీ శృంగారపుఁ దోఁటలై యున్నవి; గజ వాజి రథ పదాతి సమూహంబులు పట్టణంబు లెందుఁజూచిన నీ ఠాణంబులై యున్నవి; జగదేక కుటుంబివైన నీవు సంసారంబు సేయఁగాఁ జూచి నోరూరుచున్నది. ఇతరులు మోక్షంబడుగ నెట్లు సమ్మతించెదరు? నీతోడి కాపురంబు గోరెదరుగాక! వారివలనం దప్పేమి? శ్రీ వేంకటేశ్వరా!

33

బలిబంధనా! దేహధారులకు రాగద్వేషంబు లుడుగ నెట్లు వచ్చు? బొందితో స్వర్గంబునకుఁ బోయిన ధర్మరాజును నున్నతపదంబున నున్న దుర్యోధనాదులం జూచి కనలిపడియెనట; మే మనంగా నెంతవారము? దేవా! నీవు పంచేంద్రియంబులు పఱియ విడిచి, ప్రాణుల నజ్ఞానమున ముంచియెత్తి భ్రమియింపంగా నీతో నెదిరించి వాని నణంపశక్తులమె? నీకు శరణని నీ నామసంకీర్తన చేయంగ నీ చిత్తము! మాభాగ్యము! ఎట్లు చేసిన నీ చేతిలోనివారమే! శ్రీ వేంకటేశ్వరా!

34

వేదవేద్యా! నీవు లోకవ్యాపారంబున నానాజీవులఁ బోషింపుచుండ నే నొక్కవంక నీ మూర్తి నా మనంబున భావించి చిక్కించుకొని నీతో బట్టబయలు మాటలాడుచు నానామనోరథంబులం గాలక్షేపంబు సేయుచున్నాఁడను. ఇది నీవు సేయు నుద్యోగంబునకుం బరాకుసేయుట గాదుగదా! కాదులే. విశ్వతోముఖుండవు గావున నందఱతో మాటలాడ నోపుదువు. పరిపూర్ణుండవు గావున నన్నిచోటుల నుండనోపుదువు. మా కపచారము లేదు. అనంత శక్తిధరుండవు, ననేకమహిమలవాఁడవు, నపరిమితోదారగుణుండవుఁ గావున నిట్టి నీ మాహాత్మ్యంబునకు శరణంబు; శ్రీ వేంకటేశ్వరా!