పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

17



35

దేవదేవా! నిన్ను నేఁ బలుమాఱు దలఁచిన వీఁ డేమి కోరి తలఁచుచున్నాఁడో యని నీ చిత్తంబున నుండునని యొకానొకసారి నిన్నుఁ దలంపుదును. మఱియును మేనిం బడలించి తపంబు సేసిన నంతరాత్మవైన నిన్ను బడలిక సోఁకునో యని యూరకుందును. పేరుకొని నిన్నుఁ బిలిచిన నన్నిపనులు విడిచివత్తువో యని మౌనంబున నుండుదును. జగత్తున నీ వుండుట భావించిచూచిన నిన్ను శోధించిన ట్లయ్యెడినోయని పరాకుచేసికొందును. నీ చరిత్రంబులు సారెసారెకు వినం గడంగిన రహస్యంబులు బయలఁ బడునో యని యాలకింపను. నీ కొలువు సేసి పాదంబులకు మ్రొక్కంగా మందెమేల మయ్యెడినో యని యంతట నింతట నుండి సేవింతును. ఇది యెఱింగి నీవే దయంగావుము; శ్రీ వేంకటేశ్వరా!

36

వైకుంఠనాథా! హిరణ్యగర్భాదులకుఁ దండ్రివైన నిన్ను, సనకాదులకు నేలికవైన నిన్ను, దివిజులకు రక్షకుండవైన నిన్ను, మునులకు వరదుండవైన నిన్ను, జ్ఞానులకుఁ బరదైవతంబవైన నిన్ను, జగంబులకు మూలకారణమవైన నిన్ను యశోదానందగోపులు పుత్రుండవని పెంచిరి; గోపికాజనంబులు పతి వని తలంచిరి; పాండవులు బావమఱఁదివని భావించిరి. వీర లటువంటి మమకారంబు లనుభవించిరి. మఱికొందఱు ముచికుంద దధిభాండ కమలాకర భీష్మాదులు పరతత్త్వమైన నారాయణుండవని భజియించి బ్రహ్మపదంబునం బొందిరి. ఇన్నివిధంబులవారికి నీ వొక్కండవే గుఱి. ఎటువలె భావించిన నటువలె నౌదువు. వివేకింప నేర్చినవారి పాలిటి నిధాన మవుదువు; శ్రీ వేంకటేశ్వరా!