పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు.

నీవల్ల నీడేఱెడిదె. ఈ యర్థంబు మఱవ కాదరింపుమయ్యా! నే నెప్పుడు నీ సూత్రంబున నాడెడు బొమ్మను; నా విన్నపములు పదివేలు విన్నపములుగా విన నవధరించి నన్నుం గరుణింపవే శీృ వేంకటేశ్వరా!

20

హయగ్రీవా! కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రికృష్ణ యనియెడి చతుర్వింశతి నామంబులు పాపహరంబులు; పుణ్యంబుల కునికిపట్లు; నుతించువారికి వచనభూషణములు; కోరినవారికిఁ గొంగు బంగారంబులు; జ్ఞానులకు సిద్ధమంత్రంబులు; ఇహపరంబులకుఁ గామధేను కల్పవృక్ష చింతామణు లివి; శీృ వేంకటేశ్వరా!

21

ప్రహ్లాదవరదా! బదరికాశ్రమ నైమిశారణ్య సాలగ్రామపర్వతాయోధ్యా ప్రయాగ ద్వారావతీ పురుషోత్తమ సింహాచల శ్రీ కూర్మాహోబల సేతు కుంభఘోణ తామ్రపర్ణీ శ్రీరంగ కాంచీ నారాయణగిరులు మొదలగు పుణ్యక్షేత్రంబులు, నీ నూటయెనిమిది తిరుపతులు సేవించిన ఫలము నీ దాసులంగని యొకసారి నమస్కారంబు చేసినం బ్రసన్నుండవై యిత్తువు. నాలుగువేదంబులు, ఆఱు శాస్త్రంబులు, అష్టాదశపురాణంబులు చదివిన పుణ్యంబు 'నారాయణా' యనిన నొసగుదువు. అగ్నిష్టో మాతిరాత్ర వాజపేయ ద్వాదశాహ పౌండరీకాది క్రతువులు గావించిన సుకృతంబు నీ శ్రీపాదంబులపై నొక తులసీదళంబు సమర్పించినఁ గలిగింతువు. తులాభార హిరణ్య గర్భాది దానంబుల ఫలంబు మీ దాసుల మనినమాత్రంబ ప్రసాదింతువు. నీవు భక్తిసులభుండవు గావున నీ శరణార్థులకుం బ్రయాసంబులు లేవు; శీృ వేంకటేశ్వరా!