పుట:Sinhagiri-Vachanamulu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పరాంకుశభ క్తిసార భట్టనాథ ప్రభృతులైన భక్తచూడామణుల మందిర ప్రాంగణాల్లో గుబాళించే భక్తి పారిజాత పరీమళాల ప్రభావంవల్లనో. శ్రీరంగేశ్వరనాభిపంకజరజశ్శ్రీసమ్మిశ్రితాలై నాడంతటా ప్రసరించే కావేరీతరంగ స్పర్శశీతలాలైన శ్రీవైష్ణవ సంప్రదాయ పవనాంకురాల సుఖస్పర్శంవల్లనో, ప్రబుద్ధమై, ప్రవృద్ధమై, వైష్ణవ పారమ్య ప్రతిష్ఠాపన స్రవణమైన విశిష్టాద్వైత సిద్ధాంతం ఉత్తరాశయందు కూడాదాక్షిణ్యం వహించి పరమాత్మలాగ సర్వవ్యాపి అయింది.

ఆళ్వారులు - ఆచార్యులు

భక్తి భూమికా సుప్రతిష్ఠిత మైన ఈ శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రవర్తకులు 'ఆళ్వారులు.; ప్రచారకులు. ఆచార్యులు. ఆళ్వారులు పన్నిద్దరూ భక్తిపార వశ్యంలో తమిళంలో పాశురాలుపాడి వకుళామోదవాసితాలైన భక్తివాసనల్ని దాక్షిణాత్యులహృదయాంతరాళాల్లో చిరస్థాయిగా ప్రసరింప చేసేరు. ఆళ్వారులు నాటిన భక్తి వల్లరులకు పాదుగా, పందిరిగా సిద్దింతాను ష్ఠానాలను ఏర్పరిచి తత్పరిరక్షణం కోసం పాటు పడ్డవారు ఆచార్యులు.

ద్రావిడ వేదవ్యాసులు

వీరిలో అన్ని విధాలా ముందు పేర్కోదగ్గవారు నాధమునులు. వీరు అస్తవ్యస్తంగా ఉన్న ఆళ్వారుల పాశురాలను సంపాదించి, సంకలనంచేసి, ఒక వ్యవస్థతో-ఒక వింగడింపుతో, 'నాలాయిర దివ్యప్రబంధం ' గారూపొందించి “ద్రావిడ వేదవ్యాసులై "నవారు. వీరి పౌత్రులుయాము నాచార్యులవారు. శ్రీవైష్ణవ దర్శనానికి సిద్దాంత పరమైన ప్రతిష్ఠాభూమిక సమకూర్చినవారు వీరు. యామునమును లకెన్నో శతాబ్దాలకు ముందే ఉత్తరాన్న సంకర్షణ వాసుదేవారాధకులుండేవారనీ, వార్ని సాత్వతులు, • భాగవతులు అని వ్యవహరించేవారనీ చారిత్రకులకధనం.

భాగవతమతం

వైదిక "కర్మకాండ" మీద, తద్విధానాలమీద, వర్ణవ్యవస్థమీద ఒక రకమైన తిరుగుబాటు చేసిన వారువీరు. వీరిసంప్రదాయ భూమికకేవల భక్తి . ఇది రానురాను "వర్ణ వ్యవస్థను” పాటించే సాంప్రదాయికుల్నీ ఆకర్షించింది.