పుట:Sinhagiri-Vachanamulu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరిచందనం

ఆంధ్ర వచన వాఙ్మయ ప్రథమాచార్యుడు శ్రీ కృష్ణమా చార్యులను గూర్చీ, చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలైన అతని సింహగిరి నరహరివచనాలను గూర్చీ ముచ్చటించే ముందు అతని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన ద్రామానుజుల శ్రీవైష్ణవ సిద్ధాంత దృక్పథం గురించీ, కృష్ణమాచార్య వాఙ్మయ జీవలక్షణమైన శ్రీవైష్ణవ సంప్రదాయ రహస్యాన్ని గురించీ ఇక్కడ పూర్వరంగగా భూమికగా ప్రస్తావించటం ఆవశ్యకం.

- పూర్వరంగభూమిక -

నేడు ఖండాంతరాలవారు భారత భూమిని పూతభూమిగా, తత్వవిచారజన్మభూమిగా భావించి అట్టిది తమ జన్మభూమి గానందుకు విచారించినట్లే, నాడుదేవతలు సైతం భారతజనిని స్పృహణీయంగా భావించేరు.

"గాయంతి దేవాః కిలగీతకాని
 ధన్యాస్తుయే భారత భూమిభాగే,
 స్వర్గాపవర్గాస్పదమార్గ భూతే
 భవంతి భూయః పురుషాస్సురత్వాత్ "

దక్షిణ దిక్కు సర్వోత్తర

భారత మంతా ఇట్లా పవిత్రమూ దివ్యస్పృహ ణీయమూకాగా భక్తాగ్రగణ్యులైన ఆళ్వారుల అవతారంతో దక్షిణం విశేషించి పూతతమం అయింది. “దిగ్దక్షిణాపి పరిపక్త్రిమ పుణ్యలభ్యాత్సర్వోత్తరాభవతి దేవి తవావతారాత్" అని శ్రీమన్నిగమాంతదేశికులవారన్నట్లు గోదాదేవి ఆవిర్భావంతో, దక్షిణ దిక్కే సర్వోత్తర అయింది.

ఆళ్వారులు - వైష్ణవం

ఆధునికుల దృష్టిలో దాక్షిణాత్య శ్రీవైష్ణవ భక్తి వాఙ్మయ చరిత్రలో క్రీ. శ. మూడవ శతాబ్దినుంచి ఎనిమిదవ శతాబ్దం వరకు ఒక స్వర్ణయుగం. భక్తిసార భట్టనాధ ప్రభృతు లైన ఆళ్వారులతో పాటు అనన్యభక్తితో ఆరవిందాక్షుణ్ణి అర్చించి ఆత్మ సమర్పణం చేసుకొన్న ఆండాళ్ అవతరించడంతో ఈ కాలపు చరిత్ర సంపుటం చాంపేయసుమ పరిమళ సంభరితంబంది.