పుట:Sinhagiri-Vachanamulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50


“దేవా మీభక్తుండై యుండి రుద్రభక్తుల దూషించుట
దోషంబని తెలిసియందుకు
“మద్భక్త శ్శంకరద్వేషి, మద్ద్వేషీ శంకరప్రియః
తావుభౌ నరకం యాతఃయావచ్చంద్ర దీవాకరౌ,"
అనియెడువాక్యప్రమాణంబులు తెలిపి"

దీనివల్ల ఆయన మతసహనం అవగతం అవుతుంది. ఇంతేకాదువిష్ణుభక్తుని మహత్వాన్ని ప్రతిపాదించే ఒక కథ చెప్తారాయన అందులో--కొందఱు రుద్రభక్తులు. ఒకడే విష్ణుభక్తుడు. రుద్రభక్తులమీద ఎట్లాంటి కువిమర్శాచెయ్యకుండా చాలా జాగ్రత్తగా చిత్త శుద్ధితో కథనడిపించి విష్ణు భక్తుడి మహత్వం ప్రకటింపచేస్తారు. అతని మహత్వానికి ముగ్ధులైన రుద్ర భక్తులు అతణ్ణి ఆచార్యుడుగా వరించి విష్ణు భక్తు లౌతారు. ఈ చివరిఆంశంకూడా సూక్ష్మంగా ధ్వనిస్తారుగాని వాచ్యం చెయ్యరు. ఆయన మర్యాద ఆల్లాంటిది. రుద్రభక్తులు విష్ణుభక్తు లవటంలో విష్ణుభక్తుని చిత్త శుద్ధితోడి మహత్వమూ నిశ్చయ జ్ఞానంతోడి భావశుద్ధీ కారణాలు.అంతేకాని యిందులో శివ కేశవుల “తులన' ప్రసక్తే లేదు.

శ్రీవైష్ణవసంప్రదాయ విశేషాలు

శ్రీమద్రామానుజ సిద్ధాంతానుయాయి అయిన ఆచార్యులవారు ప్రపన్న సంప్రదాయంబాగా ఎఱిగినవారు. మేదినీసురులు, ఆచార్యులు. జననీ జనకులకంటే పెద్దలైన ప్రపన్నులకు ప్రథమస్థానం యిస్తారాయన. ఆళ్వారుల్నీ భాగవతుల్నీ, తరచు తలుచుకొంటారాయన. పదుగురాళ్వారులనటంలో ఈయన ప్రాచీనత ప్రకటితం అవుతోంది. పదముగ్గురు భాగవతు లంటారాయన, కానివారు పదునలుగురు. 'ప్రహ్లాద నారద పరాశర' శ్లోకం ఈయనెరగంది కాదు. మఱి యీ పదముగ్గురిమాట ఎట్లాగో?. ఇక్కడ ఆయన అంతరంగం ఏమిటో తెలీదు.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆచార్య కటాక్షానికి విశేష ప్రాముఖ్యం ఉంది. చాలా చోట్ల తన్మహత్వాన్ని ప్రకటిస్తారాయన.