పుట:Sinhagiri-Vachanamulu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

25

37

దేవా, భగవద్భాగవతులకు సమర్పింపక, తాననుభవించక కూర్చిన యర్థము ఇహపర, ఉభయభ్రష్టంబౌను. అది యెట్లనిన, మధువుగూర్చిన మక్షికరీతియౌను. అటుగాన మా సింహగిరి నరహరికి తళిఘలు సమర్పించుక తళిఘల తచ్చేషం తాననుభవించవలెను. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ!

38

దేవా, యీ భూలోకంబున మనుజులై దుర్మదాంధులు అన్యాయార్జితంబైన ధనంబులన్ని సకలంబులను యిల్లు చూరగొని 'మోక్షార్థులంజేయ శేషాచలంబున తిరువేంకటనామంబులు సకలదేవతామూర్తులు రుద్రుండును బ్రహ్మయును స్థావరజంగముంబుల భోగంబులం బొరలక బొందక కలియుగంబునపడి ఆరగింపులకు పరంజ్యోతి మహామహిమ తృప్తి బొంద శ్రీపురుషోత్తమంబున ప్రథమ తిరుపతిని శానారూపంబున నిలిచితివి దేవా, నీవు పుష్పాంజలి యవసరంబున మహామహోత్సవంబువలన ధర్మాధర్మంబులకు చాతుర్లక్షగ్రంథంబున వరాహరూపంబున నిలిచితివి. దేవా, నీవు ఉభయకావేరీమధ్యంబున వైష్ణవరామానుజమతమున కాటపట్టై, విభీషణవరదుండవై, శేషశయనుండవై, దక్షిణాభిముఖండవై, లక్ష్మీసమేతుండవై భాగవతులగు వైష్ణవులకు ప్రసన్నుండవై, అనంతదివ్యనామతేజుండవై, పరంజ్యోతి తత్ప్రకాశుండవై, అనంతనాముండవై, వైకుంఠంబనం బరగె శ్రీరంగంబున శేషశయనుండవై భూలోకంబున విహరించి నాడని మా యాచార్యు లీవిధంబున తెలిపినారని నమోనారాయణాయని మీ ప్రభావంబు నారదుండు దేవతలకు జెప్పిన వాక్యంబు నాకుంజెప్పినాడవు గాన నాకు సకలంబును మీ మహిమ వలనం గానంబడె. ఓం సదా పశ్యంతి సూరయ, యని, యద్భావం తద్భవతి యని మిమ్ముంగనుగొంటి. యతిరామానుజ మునిదాతారు. అనాదిపతి. సింహగిరి నరహరీ!