పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5వ అధ్యాయము.

భగవంతుడు — జీవుడు

154. బ్రహ్మముమాత్రము సత్యము; వానివ్యక్తరూపములగు జీవజగత్తులు అసత్యములు - అనిత్యములు.

155. మాయాబంధయుతజీవుడు నరుడు; బంధరహితుడు ఈశ్వరుడు.

156. ప్రకృతిలోని పంచభూతముల సంగమున జిక్కిన బ్రహ్మము బాధితుడగును.

157. జీవాత్మ పరమాత్మలకుగల సంబంధమెటువంటిది? ప్రవాహమునకడ్డముగా బల్లనొకదానిని నిలిపినయెడల, అందలి జలము రెండుగాచీల్చబడినట్లు అగపడును. అటులనే మాయోపాధివలన అద్వైతబ్రహ్మము ద్వైతమైగోచరించును. యదార్థమునకు రెండులేవు, ఒక్కటియే.

158. జలమును బుద్బదమును ఒక్కటియే. బుద్బుదము (బుడగ) నీటిలోనెపుట్టుచున్నది, నీటిలోనెతేలుచున్నది. తుదకానీటిలోనె అడగుచున్నది. అదేతీరున జీవాత్మయు పరమాత్మయు ఒక్కటియే. అంశభేదముమాత్రము కలదు. ఒకటి ఖండము, రెండవది అఖండము, ఒకటి పరతంత్రము, రెండవది స్వతంత్రము.

159. చమురులేక దీపమువెలుగనిరీతిని, నారాయణుడు లేక నరుడు జీవింపజాలడు.