పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

358

వాటిల్లినది? నీ వాఏడుకుండలను తెచ్చుకొంటివాఏమి?" అని అడిగెను. ఈ ప్రశ్నవినగానె మంగలి ఉలికిపడి "ప్రభూ! ఎవరాసంగతిని ఏలినవారికి వినిపించినారు?" అనెను.

రాజిట్లుపలికెను:- "నీకుతెలియదా? ఎవరికా ఏడుకడవలను యక్షుడు దత్తముచేయునో వారియందీలక్షణములే కానవచ్చును. ఆయక్షుడు నాకును వానినితీసుకొమ్మనిబోధించినాడు; కాని ఆధనము వ్యయధనమా, దాపుడుధనమా, అనగా ఆసొమ్ము వాడుకొనుటకు వీలగునదాలేక దాచి పేర్చియుంచవలసినదా అని అడిగితిని. నేనీప్రశ్నను అడుగగనే యక్షుడు మారుపలుకక పారిపోయినాడు. ఆధనము ఎవరును వాడుకొనదగినదికాదని నీకుతెలియదా? ఇంతేకాక దానిని తెచ్చుకొనువారికి ధనము కూడబెట్టుతలంపేగాని వినియోగముచేయుబుద్ధి యుండదు. తక్షణమేపోయి ఆధనమును తిరిగి యిచ్చివేయుము." రాజిట్లుబోధించగా మంగలి బుద్ధితెచ్చుకొని ఆచెట్టుకడకుపోయి "నీబంగారును నీవుతీసికొనిపొమ్ము" అనెను. "సరే" అని యక్షుడు ప్రతిపలికినాడు. మంగలి యింటికిపోయిచూడగా, ఆకడవలు తనుయిల్లుచేరిన తీరుననే అతివిచిత్రముగా అదృశ్యమైపోయినవి. మఱియు ఆతడు ఎన్నెన్నియోపాట్లుపడి తన జీవితకాలమున సంపాదించిన ధనమంతయుకూడ ఆకుండలతో అదృశ్యమైపోయినది! స్వర్గ రాజ్యమున కొందఱి గతి యిట్లుండును. యదార్ధమగు వ్యయము ఏదియో యదార్ధమగు ఆదాయము ఏదియో, ఎఱుంగనివారు తమ సర్వస్వమును పోగొట్టుకొందురు.