పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

359

41వ అధ్యాయము.

966. ఒకశిష్యుడు శ్రీపరమహంసులవారిని కామమును జయించుటెట్లని ప్రశ్నించెను. ఏలన అతడు యెంతగాధ్యానమున కాలముగడపుచున్నను దుస్సంకల్పములు అప్పుడప్పుడు వానిమనస్సున పొడగట్టుచునేయుండెను. శ్రీపరమహంసుల వారిటుల బోధించిరి: ఒకనియొద్ద పెంపుడుకుక్క యుండేది. వాడు దానినిగారాబముగచూచి, తనవెంటదీసికొనిపోవుచు, దానితో ఆటలాడుచు ముద్దాడుచు నుండేవాడు. ఒకజ్ఞాని వానిచేష్టలనుచూచి, ఆకుక్కకు అంతచనువీయదగదని మందలించినాడు. అది మూర్ఖజంతువు; ఒకనాడు కఱవను కూడ తటస్థించవచ్చును. ఆమనుజుడు సాధువచనముల మనస్సునబెట్టుకొని, కుక్కను ఒడిలోనుండి త్రీసివేడినాడు; ఇక నెన్నడును దానిని దఱిరానీయ దగదనియు, ముద్దాడదగదనియు నిశ్చయముచేసికొనినాడు. కాని ఆకుక్క యజమానుని భావమును గ్రహించజాలదు కావున ఎప్పటియట్లనే ఆదరింపబడి ముద్దిడుకొనవడుటకై తఱచుగా వానికడకు పర్విడివచ్చుచుండెడిది. అనేకపర్యాయములు అతడు దానిని విదలించి కొట్టగా కొట్టగాగాని అది వానిని బాధించుట మానలేదు. నీస్థితియు అటులనున్నది. నీవింతకాలమును నీహృదయమునబెట్టుకొని లాలనచేసినకుక్క, దానిని నీవు విడువ నిశ్చయించుకొనినను అదినిన్ను సులభముగా విడువదు. అయినను గొప్ప భంగపాటులేదు. ఆకుక్క ముద్దాడుమని దాపునకు వచ్చినప్పుడు, దానిని ఆదరింపకుము; అది చేరవచ్చునప్పుడెల్ల బాగుగమర్దించి వెడలనంపుము. కొంతకాలమునకు, అదినిన్ను బాధించుటమాని దూరముగ తొలగును.