పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

351

41వ అధ్యాయము.

బారలకు కొంచెము తక్కువగా నుండెను. వేర్వేఱు స్థలములకై పోక పట్టుదలతోడను విశ్వాసము తోడను తనకష్టములో సగపాలు మొదట త్రవ్విన నూతినే యింకను లోతు చేయుటలో వినియోగించిన యెడల దివ్యమైన జలము వానికి లభించియుండును. తడవ తడవకు మతములను మార్చుకొనుటయు యిట్టిదే! ఒక్క సాధననేనమ్ముకొని, దానియోగ్యతనుగూర్చి సంశయమును పూనక, భక్తివిశ్వాసములతో సాగించిన యెడల తప్పక జయముచేకూరును.

959. ఒక భార్యయు భర్తయు కూడ సంసారత్యాగము చేసి, తీర్థయాత్రలసేవించ మొదలిడిరి. వారు దాఱినిపోవుచుండగా, భార్యకన్న కొంచెము ముందు నడచుచున్నభర్తకు త్రోవలో రవ్వయొకటి కంటబడినది. దానిని భార్యచూచినయెడల ఒకవేళ లోభముచే మోహితయై వైరాగ్యఫలమును చెడగొట్టుకొనునేమొ యను భయము వానికి తోచినది. వెంటనే ఆరవ్వను నేలలోపూడ్చిపెట్టి, ఆమెకు కాన్పించకుండ చేయవలయుననుతలంపుతో నేలను గోకనారంభించెను. ఇట్లతడు నేలనుగీచుచుండగా భార్యసమీపించినది. అతడు చేయునదేమనిప్రశ్నించినది. సరియైన జవాబునీయక ఏమోమొ చెప్పి తప్పించుకొనజూచెను. ఇంతలో రవ్వ ఆమెకు కాన్పించినది, భర్తయుద్దేశ్యము ఆమెకు పొడగట్టినది. ఆమె యిట్లు మందలించెను:- "మీరెందుకు సంసారవిసర్జనముచేసి వైరాగ్యము పూనితిరి? ఆ రవ్వకును మట్టిబెడ్డకును భేదమేల మీకు స్పురించవలెను?"