పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

339

41వ అధ్యాయము.

వచ్చు!" అని వేళాకోళముగ వచించును. ఐహిక తాత్పరత నెఱుంగననెడి యీబ్రాహ్మణుడు మోము తేలవేసి "అబ్బే, ఆబ్రాహ్మణుడు చాలపేదవాడు అంతకంటె తక్కువ నిచ్చిన బాగుండదు" అని నంజుచు మాటాడబోవును. "వీలుకాదు ఒక్కబేడకన్నహెచ్చు యిచ్చుటకు అవకాశములేదు. ఇష్టమైనయెడల అదియ్యండి" అని భార్య పలుకును. ఈబ్రాహ్మణుడు ఐహికచింతలుపెట్టుకొనడు గాన, భార్యయిచ్చినదానినేతీసికొనును. మరునాడాయాచకునకుదక్కునది బేడయే. ఐహికచింతలు వీడితిమని చెప్పుకొను మీగృహస్థులు నిజముగా స్వాతంత్ర్యములేనివారు; ఏలయన వారు స్వయముగా కుటుంబవ్యవహారములను చక్కబెట్టుకొనరు. తాము చాలయోగ్యులమనియు సాధుపుంగవులమనియు అనుకొందురు. కానియధార్థమునకు ఇల్లాండ్రఅదుపులోనుండి వారలుచెప్పునటుల వర్తించువారే; వీరియొద్ద సామాన్య పురుషస్వభావమును కొఱవడియుండును.

949. బావిలో ఒక కప్ప యున్నది. అది ఆనూతిలో బహుకాలమువాసముచేసినది. అదిదానిలోనెపుట్టి, దానిలోనెపెరిగినకప్ప. ఒకనాడు సముద్రములోనుండెడి కప్పవచ్చి యీ నూతిలోపడుట తటస్థించెను. నూతిలోనికప్ప క్రొత్తగావచ్చిన దానిని చూచి "ఎక్కడిదానవు" అని ప్రశ్నించినది.

సముద్రపుకప్ప :- "నేను సముద్రమున నుండుదానను"

నూతికప్ప:- "సముద్రమా! అదెంత పెద్దదిగానుండును?"

సముద్రపుకప్ప:- "అది చాల పెద్దది!"