పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

300

864. ప్రశ్న:- భగవంతుడే ఈజీవులుగా ఉన్నయెడల ఇక పాపములేదు; పుణ్యమును లేదుగదా?

ఉ:- అవును; ఉన్నది, మఱియు లేదుకూడను. ఆయన మనలోని అహంకారమును నిలిపినప్పుడు, ద్వైతభావమును, పుణ్యపాపముల విచక్షతయు నిలుపును. ఒక్కొకప్పుడు కొందఱిలోని అహంకారమును బొత్తుగతొలగించును; అట్టివారు పుణ్యపాపములకు అతీతులు. నరుడు బ్రహ్మసాక్షాత్కారమును పడయునంతవఱకు ద్వైతదృష్టియు శుభాశుభ భేదములును ఉండితీరును. ధర్మాధర్మములు రెండును నీకు సమములే యనియు భగవంతుడేమిచేయించిన దానినే చేయువాడ ననియు నీవు నోటిమాటలతో అనవచ్చును. కాని నీ హృదయములో అవన్నియు వట్టిపలుకులే యని తెలియుచుందువు. నీవేదేని చెడుపనిచేయగానె నీ అంతరాత్మ బాధించుచునే యుండును,

865. నీవు ప్రజలతో కలిసి యుండబోవునప్పుడు వారందఱి యెడలను నీకు ప్రేమ యుండవలయును. వారితో స్వేచ్ఛగా కలిసి యేకమైపొమ్ము. "ఓ! వారు సాకారమును నమ్ముదురు; నిరాకారమును నమ్మరు అనియో, వారు నిరాకారమును నమ్మెదరు సాకారమునందు విశ్వాసము చూపరు అనియో, అతడు హిందువు, ఇతడు క్రైస్తవుడు, వేఱొకడు మహమ్మదీయుడు అనియో పలుకుచు, మూతి విఱిచి వారిని ద్వేషించ బోకుము. భగవంతుడు తననుగూర్చి ఎంతవఱకు తెలిసికొను అవకాశమునిచ్చునో అంతవఱకే నరుడు ఆయనను తెలిసికొనగలడు.