పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

241

35వ అధ్యాయము.

679. మనస్సు చంచలమై తడబడుచుండునంతకాలమును నరునకు సద్గురునివలనను, సాధుసంగమువలనను ఏమియు మేలుచేకురబోదు.

680. అచ్చటచ్చట నేరుకొనినగింజలతో పావురముల బుగ్గలెటులనిండియుండునో, అటులనే సంసారుల హృదయములు ప్రాపంచికభావములతోడను సంకల్పములతోడను నిండియుండునని వారితో కొంచెము ముచ్చటించినచో తెలియవచ్చును.

681. పాపాత్మునిహృదయము ముంగురులుచుట్టుకొను జుట్టు వంటిది. ఆజుట్టును సరళముగ దువ్వుటకు నీవెంతప్రయత్నించినను ఫలముండదు. దుష్టునిమనస్సును సరళముగను నిర్మలముగను మార్చుటకు చేయుయత్నమును అటులనే వ్యర్ధమగును.

682. రాతిముక్కలో నీరుయింకనితీరున బద్ధజీవుని హృదయమున ధర్మబోధచొచ్చజాలదు.

683. మేకు రాతిలోచొఱజాలదు. కాని మట్టిలో తేలికగ చొచ్చగలదు. అటులనే సాధుబోధనాస్తికుని హృదయమున చొఱదు. కాని భక్తునిహృదయమున అతిసులభముగ నాటుకొనును.

684. పసిబాలునకుగాని, బాలికకుగాని, సంభోగానంద మన అర్ధముకాదు. అటులనే సంసారులకు ఆత్మసంయోగానంద మన అర్ధముకాజాలదు.