పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

242

685. జిడ్డుగానున్న అద్దమున ముఖబింబము సరిగాకానరానిరీతిని కళంకితహృదయమున శివస్వరూపము ప్రకాశింప జాలదు. జిడ్డును తొలగించినయెడల ఆ అద్దమున ముఖ వైఖరి చూచుకొనుటకు వీలుపడుతెరగున హృదయము పవిత్రవంతమగునేని దానియందు భగవంతునిరూపు కాన్పించును.

686. ఒకసారి పెరుగుతోడుపెట్టినకుండలో పాలు పోయుట కెవరును సాహసించరు. పాలు విరిగిపోవునేమో యను భయము బాధించును. ఆకుండను వంటచేయుటకును వినియోగించరు; నిప్పుమీదపెట్టిన విచ్చిపోవునని జడియుదురు. కాబట్టి అది దాదాపుగా నిరుపయోగ మన్నమాట! అట్లే గృహవ్రతునికి గురువు ఉత్తమసద్భోదలు చేయసాహసించడు. గృహస్థుడు వానికి అపార్థములు కల్పించి, తన పబ్బములు గడుపుకొనుటకు ప్రయత్నించును. కొంచెము శ్రమను కలిగించు సత్కార్యములందును వానిని నియోగించ జాలడు. అప్పుడతడు తన గురువు తన మంచితనమువలన లాభము పొందజూచుచున్నాడని అపవాదము చేయగలడు.

687. లౌకికునకు జ్ఞానికున్నంత తెలివియు, జ్ఞానమును ఉండవచ్చును. ఆతడు యోగిపడునంత శ్రమను కష్టమును పడవచ్చును; సన్యాసి చేసినంత త్యాగమును చేయవచ్చును. కాని వాని కఠిన ప్రయత్నములన్నియు వ్యర్థములే. ఏలయన వాని శక్తులన్నియు వక్రగతిని నడచును; ఆత డెన్నిపాట్లుపడినను, భగవంతునికొఱకు కాక, భౌతిక సంపదలు భోగములు, ఖ్యాతికొఱకే.