పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

195

27వ అధ్యాయము.

(5) నిత్యసిద్ధులు:- పుట్టువుతోడనే సిద్ధులై యుండువారు. సొర గుమ్మడి మున్నగుతీగెలందు పూమొగ్గలు విచ్చుటకు పూర్వమే పిందెలుకానవచ్చును. అటులనే నిత్యసిద్ధులు పరిపూర్ణులయియే జన్మింతురు. సిద్ధత్వముంగూర్చి వారుచేయు నటుల కాన్పించుసాధనలన్నియు, మానవజాతికి ఆదర్శముం జూపుట కొఱకుమాత్రమే అగును.

559. ప్రశ్న:- సిద్ధిపొందినపురుషుడు పొందుస్థితియెట్టిది?

జవాబు:- (నరుడుసాధించు పరిపూర్ణతను, బాగుగవండినకాయకూరలస్థితిని సిద్ధిఅనవచ్చును - శ్లేషాలంకారమునకు అవకాశముగలదు)

చిలుగడదుంపగాని, వంకాయగాని, సిద్ధినిపొందినప్పుడు (అనగా చక్కగా ఉడికినప్పుడు) మెత్తబడిగుజ్జువలె నుండును. అటులనే సిద్ధినిపడసినపురుషుడు, (అనగా పూర్ణత్వమును పొందినమనుజుడు) నిండునమ్రతయు, సాధుత్వమును కలిగియుండును.

560. పాదరసముగల పాత్రలో పడవేసిన సీసపుముక్క దానిలో కఱగిపోవునటుల వ్యష్టిజీవాత్మ బ్రహ్మసాగరమున బడినప్పుడు తనప్రత్యేకతను విడిచివేయును.

561. ధ్యానినిష్ఠయందుండి, పక్షులుతనజూట్టులో గూండ్లు కట్టినను తెలియజాలనంతగా స్మృతివిడిచిన యతనికి ధ్యానసిద్ధి లభించినదనవచ్చును.