పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

169

25వ అధ్యాయము.

499. హరినామోచ్చారణము చెవులకు సోకగానె నేత్రములు బాష్పపూరితములగు దశ ప్రాప్తించునంతదాక భక్తిసాధనలు అవసరములు. భగవన్నామము సూచితమగు వెంటనే ఆనందబాష్పములు వెల్లివిఱియ, హృదయముప్పొంగునతనికి భక్తిసాధనలు ఇంక నగత్యములేదు.

500. భగవంతుడు పంచదారకొండవంటివాడు. చిన్న చీమపోయి ఒకచిన్న నలుసును తెచ్చికొనును; పెద్దచీమ పోయి ఒకపెద్ద పలుకును తెచ్చికొనును; కాని ఆకొండ ఎప్పటివలెనే యుండును; తఱగదు. భగవద్భక్తులు యిటులనే యున్నారు. భగవంతుని విభూతులలో అత్యల్పమగుదానిని గాంచియే వారు పరవశులయిపోవుదురు. వాని మహిమలను, విభూతులను, అపరోక్షముగ జూచుటకు ఏవాడును భరింపనోపడు.

501. కొందఱికి గుక్కెడుసారా త్రాగినంతనే తలతిరిగిపోవును. మరికొందఱికి రెండుమూడుసీసాలు త్రాగినగాని కైపురాదు; వీరును వారును కైపువలని ఆనందమును సమముగనే పొందుదురు. అదేవిధముగ కొందఱు భక్తులకు భగవద్విభూతియొక్క ఒక్కకిరణముంజూచిన మాత్రాన పరవశత కల్గును; మఱికొందఱు భక్తులకు జగన్నాధుని ప్రత్యక్షముగ దర్శించినప్పుడే పారవశ్యము చేకూరును; వీరును వారును గూడ దివ్యానందభరితులేయై సమముగ ధన్యులగుదురు.

502. బ్రహ్మజ్ఞానము పురుషునిబోలునది; భక్తియో స్త్రీ వంటిది; జ్ఞానమునకు భగవంతుని అతిధిశాలవఱకే ప్రవే