పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

154

457. నరుని లౌకిక ప్రవృత్తునిగను, కామినీకాంచనప్రియునిగనుచేయు "అహం" కారము క్షుద్రమైనది. ఈ "అహం" కారము నడుమచేరి వ్యష్టిని, సమష్టినుండి వేఱుపఱచుచున్నది. నీటిమీద పుడకనొకదానిని పడవేసిన యెడల ఆనీరు విభాగమైనట్లుకాన్పించును. ఈపుడకయే "అహం" కారము. దానిని తొలగించిరా, నీరంతయుఏకమై ఒక్కటగును.

458. వాననీరు ఎన్నడును మెట్లమీదనిలువదు; అదిపల్లమునకే ప్రవహించివచ్చును. అదేరీతిని భగవదనుగ్రహము గర్వితులయొక్కయు, డాంబికులయొక్కయు, హృదయముల నుండిజారి, దీనజనులహృదయములందు నెలకొనును.

459. బియ్యము, పప్పు, ఆలుగడ్డలుమున్నగునవి చల్లని నీళ్లుగలకుండలోవేసినను, దానికి నిప్పుసెగతాకనంతవఱకే వానిని మనముతాకగల్గుదుము. జీవునిస్థితియు యిటులనే యుండును. ఈ దేహమే భాండము, ధనము, విద్య, కులము, వంశము, అధికారము, పలుకుబడి మొదలగునవి బియ్యము, పప్పు, ఆలుగడ్డలు మున్నగువానికి పోల్పవచ్చును. "అహం" కారమే అగ్ని. 'ఈఅహం' కారముసోకినచోజీవునకుతీండ్రము కల్గును.

460. సూర్యుడు లోకమునకంతకును వేడిని, వెల్తురును యొసగును; కాని మబ్బులుక్రమ్మి వానికిరణములనుఅడ్డగించివేయునెడల అతడేమియు చేయజాలడు. అధేవిధమున "అహం"కారము హృదయమును ఆవరించుచో భగవంతుడు అందుప్రకాశింపజాలడు.