పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

153

22వ అధ్యాయము.

రూపమను' యిట్టిభావముతో వెలయు "అహం" కారము పక్వమైనది ఇది "నాయిల్లు, నాబిడ్డ, నాభార్య, నాతనువు' ఈరీతిగా తలపోయు "అహం" కారము అపక్వమైనది.

455. ప్రశ్న - "దాసోహం" భావముగలవాని అనుభవములును ప్రేరణలును యెట్టిలక్షణములు గలవిగ నుండును?

జవాబు:- ఆభావము సత్యమును నిర్మలమును అగు నెడల, యాఅనుభవములును, ప్రేరణలును, పేరునకుమాత్రము లీలగానుండును. బ్రహ్మసాక్షాత్కారానంతరము "దాసోహం" భావముగాని, భక్తభావముగాని, ఎవనియందేనినిలిచియున్నను, అతడు ఎవనికిని అపకారము చేయజాలడు. అట్టివానియందు వ్యష్టిభావంపు విషయమంతయు హరించి పోయియుండును. పరుశవేదిని తాకినఖడ్గము బంగారుగ మారిపోవును. దాని ఆకారము నిలిచియుండునుగాని అది ఏరికిని హానికూర్పజాలదు.

456. శంకరాచార్యుల యొద్దయొక శిష్యుడు చిరకాలము సేవలుచేయుచుండెను. కాని గురువు వాని కేమియు బోధించి యుండలేదు. శంకరాచార్యులు ఒకతరి యొంటరిగాకూర్చుండి యుండ, వెనుకనుండి ఎవరో వచ్చుచున్నటుల కాలి చప్పుడు ఆయనకు వినవచ్చెను. "ఎవరక్కడ" అనెను. "నేనే" అని ఆశిష్యుడు పలికెను. ఆచార్యులవారప్పుడు "నేను" అనుమాట నీకంత ప్రియమగునేని, దానిచే విశ్వమునంతటిని ఆవరించు నంతగా పెంపుచేయుము; లేదా దానిని పూర్ణముగా విడిచి వేయుము" అని బోధించిరట!