పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

155

22వ అధ్యాయము.

461. "అహం"కారము భగవంతుని మనకు కానరాకుండ కప్పిపెట్టు మేఘము లీలనున్నది. సద్గురుకటాక్షము వలన "అహం"కారము అడగెనేని భగవంతుడు నిండుతేజముతో కాన్పింపగలడు. ఉదాహరణకు పటములో శ్రీరామచంద్రభగవానుని బొమ్మను చూడుము. (జీవుడగు) రామచంద్రభగవానుడు లక్ష్మణస్వామికి ముందుగ రెండుమూడు అడుగుల దూరమున మాత్రముండును. కాని (మాయా స్వరూపిణియగు) సీత వారిరువురకును నడుమనుండుటచేత, లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రుని దర్శనము లభింపకున్నది.

462. ఒక్కొక్క ఉపాధిచేరినకొలదిని జీవుని నైజము మారుచుండును. ఎవడైనను నిగనిగలాడు నల్లంచు సన్నధోవతిని గట్టి సోకుగ దుస్తులు ధరించెనేని, నిధుబాబు విరచిత శృంగారగీతములు వాని పెదవులపై నాట్యము సలుప మొదలిడును. ఇంగ్లీషుబూట్లు తొడగెనా కాలులీడ్చుకొనుచుపోవు బక్కవానికైనను డంబము సోకును. తక్షణమే అతడు ఈలలువేయసాగును; మేడ మెట్లెక్కవలసినచో దొరగారివలె మెట్టుపైనుండి మెట్టునకు కుప్పించుచుపోవును. వానిచేతికొక కలము చిక్కినయెడల, కైవశమైన కాగితము మీద నెల్ల గిలుకసాగునుకదా!

463. ధనమనునది మిగుల తీవ్రస్వభావముగల ఉపాధి ఏనరుడేని ధనికుడయ్యెనా వెంటనే పూర్ణముగమారిపోవును.

464. వినయ విధేయతలతోనొప్పు బ్రాహ్మణుడొకడు (ఇక్కడికి దక్షిణేశ్వరమునకు)తఱచుగా వచ్చుచుండెడివాడు.