పుట:Shodashakumaara-charitramu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

షోడశకుమారచరిత్రము


దాను జయ్యన ధవళాక్షతలు ధరించి
పొలఁతిమౌళిపై నినుపారఁ బోయ మిగులఁ
బాటలాసితసితహరిత్ప్రభలు దనరఁ
బాటవము లేక పతి తొట్రుపాటు నొందె.

64


క.

తలఁబ్రాలు వోయఁ దత్కర
జలజంబులపొందు పతికి జలజాననకున్
దళముగ సకలాంగములను
బులకొంకుకవితతి నారు వోయుచునుండెన్.

65


వ.

ఇవ్విధంబున మహోత్సవానందకందళితమానసు లైనయాదంపతులకు హోమానంతరంబ మాళవేశ్వరుం డనేకరితురగరత్నభూషణచీనాంబరాదిమనోహరధనం బరణం బిచ్చి వందిమాగధాదిజనంబుల కభీష్టధనంబు లొసంగి యందఱ నన్నపానాదులం బరితృప్తులం జేసి దంపతుల నర్హమందిరంబుల నునిచె నయ్యవసరంబున.

66


సీ.

అబ్ధీశుసాంధ్యసేవాభిషేకమునకు
        జలధి ముంచినహేమకలశ మనఁగ
జలధియుద్యానభూజంబున రాలిన
        బంధురపరిపక్వఫల మనంగ
నంబుదదంతి గోరాడ నంబుధిఁ బడ్డ
        యపరాద్రిధాతురాగాశ్మ మనఁగ
వరుణకుటుంబినీకరతలంబునఁ దప్పి
        పడినమాణిక్యపుబంతి యనఁగ
వారుణీసక్తుఁ డై జాఱి వనజబంధుఁ
డపరగిరిమీఁదఁ గాల్కొన కబ్ధిఁ బడియె