పుట:Shodashakumaara-charitramu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

149


క.

ఈపొలఁతికిఁ గమలాకర
రూపముఁ దద్విద్యపేర్మి రూ పెసలారం
జూపుడును దాన మన్మథ
తాపంబు శమించుఁ దెలివి దలకొను ననినన్.

30


క.

ఆచెలువుని చిత్రాకృతి
చూచినయట్లైన రూపుచూచిన మరుచే
నేచంద మగునొ మాన్ప న
గోచర మున్మాదవృత్తి గూరినయేనిన్.

31


క.

అనునంతటఁ గమలాకరుఁ
డనుభూపతి వాహినీచయంబులతోఁ బెం
పెనయఁగ వేత్రవతీవా
హినిదరి విడిసె నని పౌరు లెల్లన్ బెదరన్.

32


క.

నీ వరుగుదెంచి తని హం
సావళి దెలివొందుటయును నానందలస
ద్భావమున నంతిపురమున
నావెలఁదిని గొనుచు బోటు లరిగెడు నంతన్.

33


గీ.

అడుగఁ బుత్తెంచుటయుఁ గమలాకరునకుఁ
బుత్రి నీ నిశ్చయము చేసె భూమిపాలుఁ
డనుచుఁ బరిచారికలు చెప్పికొనఁ గడంగ
సతికి విధికృతి నాత్మసంశయము పుట్టె.

34


క.

ఆకీరము చెప్పిన కమ
లాకరుఁడో యిన్నరేంద్రుఁ డన్యుఁడొ యని చిం
తాకులతఁ గమలమంజరి
నీకడకుం బనుప మరుఁడు నికృతి యొనర్చెన్.

35