పుట:SamardaRamadasu.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్టితఱి మతమొక్కటే జాతిని బ్రతికించి యుద్ధరించునది. అందుచేత మానవ సముద్ధరణమునకు మతమే సర్వవిధముల నవలంబనీయమని రామదాసుడు నొక్కివక్కాణించుచుండును. పడిపోవుచున్న మనుష్యులు కఱ్ఱనూతగొని నిలుచునట్లు పడిపోవుచున్న జాతి మతము నూతగా గొని నిలువబడవచ్చునని యాత డుపదేశించు చుండును. అతడు రాజకీయ విషయముల గుఱించి యంతగా బనిచేయలేదు. దానికి రెండవ స్థానమిచ్చి మతమునకే ప్రధాన స్థానమిచ్చెను. రాజ్యాంగవిషయము పాశ్చాత్యులకు జీవనాధారము. దానిని వారు రాణిగా బూజింతురు. మతమే మనకు ముఖ్యమగుటచే గ్రీకులు పారశీలకులు క్రైస్తవులు మహమ్మదీయులు మొదలగు విదేశీయులు మనపై బలుమాఱు దండయాత్రలు సలిపినను మనమతము దేశమును జెక్కుచెదరక నిలిచి యున్నవి. భరతఖండమునకు బడమటనున్న ఆఫ్‌గనిస్థానము పారశీకము మున్నగు దేశములు మహమ్మదీయ దేశము లయ్యెను; అమెరికా ఖండము పూర్తిగా క్రైస్తవదేశ మయ్యెను. మతము దేశవ్యవహారము నీరక్షీరములట్లు, ఎట్లు కలిసి యుండవలెనో యతడు జనులకు నేర్పెను. ఆ రెండును చదరంగములో గుఱ్ఱములవలె నొకదాని నొకటి కాచుచుండును. ఒకటి నాశనమైన పక్షమున రెండవది కూడ నాశనమగును. మనము చరిత్ర శ్రద్ధగా జదివిన పక్షమున గ్రీసు దేశము జ్ఞానమునకు నిధియని తెలిసికొనవచ్చును. ఆ జ్ఞానము క్రమ క్రమముగ రోముదేశమునకు, అటనుండి యింగ్లాండు దేశమునకు నటనుండి యమెరికా దేశమునకు వ్యాపించెను. నేటి కాలమున జపానీయులు ఆ జ్ఞానవృక్షము నంటు గట్టుకొని తమ దేశమున నాటు కొనిరి. ఆత్మజ్ఞానవిరహితమైన యీనాటి విజ్ఞానము గ్రామములను బరశురామప్రీతి చేయుటకును బిడ్డ లనక స్త్రీ లనక వృద్ధులనక మనిష్యులను వినాశము చేయు విమానములను ఫిరంగులను బాంబులను జేయుటకు బనికివచ్చుచున్నది. ఇంతకన్న శోచనీయమైన యవస్థ లేదు. ఆత్మజ్ఞానము లేకపోవుటయే దీనికి ముఖ్యకారణము. రామదాసుడు మతవ్యాప్తితో గూడ మహారాష్ట్రులకు స్వరాజ్యమును గూడ సంపాదింపవలెనని తలంపు గలిగి యుండెను. రామదాసుని మతము నవలంబించినవారు