పుట:SamardaRamadasu.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరెండు విషయములతో గూడి యుండవలెనని యాతని యాశయము. మానవ కృత్యము లన్నింటిలో మతము ప్రధానముగ నుండవలె ననుమాట భౌతికవిషయ పరాయణులైన పాశ్చాత్యులచెవికి మిక్కిలి వింతగా దోచవచ్చును. ఏలయన వారిబుద్ధి వినశ్వరమైన యీ భౌతిక ప్రపంచమును దాటి ఎన్నడు బోలేదు. దేహమనశ్శక్తుల సహాయమున సౌఖ్యమును శాంతిని బొంది జీవితము గడపవచ్చునని వారి నమ్మకము. వారిమతము యొక్క యసంపూర్ణస్థితి దృష్టిగోచరములైన పదార్థముల మీదికేగాని మరణానంతర జీవితముయొక్క స్థితినిగూర్చి వారి కాలోచన పోకపోవుటచే వారట్లు నమ్మిరి. కాని ప్రాచ్య దేశస్థులమైన మనము మతమే ముఖ్యముగ జేసికొన్నాము. మతమునకు, రాజకీయమునకు సంబంధము లేదని పాశ్చాత్యుల యభిప్రాయము. మనవారి కట్టి యభిప్రాయము లేదు. అందుచేతనే గాంధి మహాత్ముడు జాగ్రత్తతో నహింస సత్యము మొదలైన మతధర్మములను రాజకీయ విషయములతో గలిపెను. హిందువులకు మతమే ప్రధానము. బిడ్డపుట్టినప్పుడు జాతకరణ నామకరణాది కర్మలు మతముతో సంబంధించి యున్నవి. మనుజుడు మృతినొందినపు డుత్తర క్రియలు మతముతోనే కలిసి యుండును. వివాహాది శుభకార్యములు కూడ మతమును విడిచియుండవు. దీనినిబట్టి మన ప్రాచీనులు మతమునకే ప్రాధాన్యమిచ్చి రని తేలుచున్నది. అందుచేతనే రామదాసుడు లోకవ్యవహారములకంటె మతమునే ముఖ్యముగ నెంచెను. ఇప్పటి ప్రకృతిశాస్త్రవేత్తల యభిప్రాయము మతమునకు ఇతరవిషయములకు మధ్య గీటుగీచి రెండింటిని వేరుచేయవలయుననియు, మతము పనిపాటులు లేనివారు తీరుబడిగా గూర్చుండి చర్చింపవలసిన విషయమనియు, మనుష్యుడు భూలోకమందు దేవుని ప్రతినిధియగుటచే నీశ్వరగుణ సంపర్కముచే గాని యతడు లౌక్యవ్యవహారములలో నెఱవేరలే డని యతడు చెప్పుచుండును. మూడు శక్తులు కలసి యున్నప్పుడే మానవుడు తన లోపల శత్రువులను పైశత్రువులను జయింపజాలునని యతడు పలుమాఱు జెప్పుచుండును. జాతిక్షీణించినప్పుడు దాని ధర్మము కూడ క్షీణించును. అందుచేత నవి బాహ్యంతర శత్రువులకు త్వరగా లొంగిపోవును. క్రమముగా నది బానిసతనమున బడిపోవును.