పుట:Sakalaneetisammatamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 సకలనీతిసమ్మతము


మతానుసారంబై దేవమానవరాక్షసంబులైన సాత్త్వికరాజసకామనప్రకారంబు
లగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషాకోవిదులగు సుకవీంద్రవిరచితం
బైన ముద్రామాత్య పంచతంత్రీ బద్దెభూపాల చాణక్య ధౌమ్య విదుర ధృతరాష్ట్ర
బలభద్ర కామందక గజాంకుశ నీతిసార నీతిభూషణ క్షేమేంద్ర భోజరాజవిభూ
షణ పురుషార్థసార భారత రామాయణాది మహాకావ్యంబులు పురాణేతిహాసంబులు
కందనామాత్యు నీతితారావళి లోకోక్తి చాటుప్రబంధంబులయందునుగల నీతివిశే
షంబు లూహించి తత్తత్సారాంశంబు లయ్యైవిధంబుల వర్గసంగతంబుగా సకల
నీతిసమ్మతం బనుపేర నొక్కప్రబంధంబు రచియింపుదు నని ప్రబంధసారంబు
నకు ననుగుణంబుగా నేపురుషునిం బ్రార్థింతునో యని వితర్కించితి.

7


సీ.

ఘనకళాఘాతకర్కశకిణచేటికా
             స్తనముల నలఁదిన చందనంబు
నిశితకంటకశీలానికటమర్కటకటిఁ
             జెలువారఁ గట్టిన జేలుచేల
ప్రకటితాసవమత్తభల్లూక మౌదలఁ
             బొలుపారఁ జెరివిన పుష్పమాల
సతతపల్వలపంకసంగిలులాయంబు
             నఱుతఁ బెట్టిన తారహారపంక్తి


గీ.

కరణి గాకున్నె సాహిత్యసరణి యెఱుఁగ
కజ్జుసంగతిఁ బొదలు దురాత్మకులకుఁ
గవులు తర మెఱుఁగక యిచ్చు కావ్యకన్య
క్లేశసంసారభవనాశ కేశవేశ.

8


వ.

అని విచారించి మత్కవితాకన్యకకుఁ దగిన పురుషుండు పురాణపురుషుండె కా
నిశ్చయించి సకలజగదుత్పత్తిస్థితిలయకరుండును నిఖిలవేదాంతవేద్యుండును
బరమయోగిహృదయవాసుండును వాసవవంశాంబురాశిసుధాకరకాశ్యపసగోత్ర
పవిత్రబ్బనా(మాత్యపుత్ర) కందనామాత్యాగ్రజన్మ కేసనమంత్రిప్రతిష్ఠిత
మహాప్రసాదనిజజగన్నివాసుండును సకలలోకస్వామియు నభీష్టఫలప్రదాయ
కుఁడును నగు రామగిరి శ్రీకేశవేశ్వరునకు సమర్పించుట యదియుఁ బరమ
పూజావిశేషంబ కావుత మని మనంబున నుపక్రమించి.

9

షష్ఠ్యంతములు

క.

అంభోరుహదళనయనున
కంభోనిధికన్యకాకుచాశ్రితశుంభ
జ్జృంభితవక్షఃస్థలునకు
నంభోధరవర్ణునకు దయాంభోనిధికిన్.

10