పుట:Sakalaneetisammatamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

85

ననపోతిరెడ్డికి మంత్రియై ప్రసిద్ధి కెక్కె. కావుననే మడికి సింగనకు రాజనీతిశాస్త్రముల దౌరంధర్యము గలిగెఁ గాబోలు. మడికి సింగన కాలము కనుసరించి చూచినయెడలఁ దిక్కన కాలము 1260 కంటెఁ బ్రాఁతపడదు.

సకలనీతిసమ్మతమున సుద్దృతములగు పద్యముల కాకరగ్రంధనామము గవియే పేర్కొనియె. ఆంచు ముద్రామాత్యము. నీతిసారము, పంచతంత్రి, పురుషార్థసారము, నీతిభూషణము, కామందకము, నీతితారావళి, కుమారసంభవము, చారుచర్య, బదైననీతి, పద్మపురాణము, శాలిహోత్రము, భావతము మొదలగునవి గలవు. వీనిలో మొదటియేడుగ్రంథములు నష్టము లయ్యె. కుమారసంభవము నన్నెచోడకృతము, బద్దెననీతియు మేము ముద్రింపించి యుంటిమి. చారుచర్య శ్రీముక్త్యాల ప్రభువులచేఁ బ్రకటింపబడిది. శాలిహోత్రము పీఠికాపద్యములు గానరాక కొంతభాగము పెక్కుచోటుల ముద్రితమయ్యె. తక్కినవి సుప్రసిద్ధములు. ఈగ్రంథములన్నియు సింగనకంటెఁ (1420 క్రీ.శ.) బూర్వరచితములని స్పష్టము.

శాలిహోత్ర మనునశ్వశాస్త్రమును మనుమంచిభటారకుఁ డనుకవి హయలక్షణవిలాస మనుపేరఁ దెనిగించెను. ఇయ్యది యెంతప్రాచీనమో యెఱుగుట కానుకూల్యము లేక పీఠికాపద్యము లెచ్చటను లభించినవి కావు. ఆది చాళుక్యకంపభూపతి కంకిత మీయఁబడియె. విద్యానగరపుఁ గంపభూపతి మడికి సింగన కాలమువాఁడు కావున మనుమంచిభట్టును నతని ప్రభువగు కంపరాజును తప్పక ప్రాచీనులే.

ముద్రామాత్యము క్షేమేంద్రుఁ డను బిరుదము వహించిన లక్కాభ ట్టనుకవి రచించినట్లు తోచుచున్నది. క్షేమేంద్రకని క్రీ. శ. 1050 ప్రాంతముల నుండెఁ గావునం దద్బిరుదవహనముచే నితఁడు తత్పూర్వుఁ డగుటకు సాధ్యుఁడు కాఁడు. అతఁడు శూద్రకరాజచరిత్రమును శతపక్షిసంవాదమును రచించినట్లు లక్షణగ్రంథోదాహృతవద్యములవలనఁ దెలియుచున్నది. బాలబోధ మనియుఁ గవిసంజీవని యనియు సందిగ్ధనామములు గల యొక్కఛందోగ్రంథమున ముద్రామాత్య నీతిభూషణ పురుషార్ధసారములనుండి పద్యము లుదాహృతము లయ్యె. అందు ముద్రామాత్యములోని దని క్రిందిపద్యము గానఁబడుచున్నది.