పుట:Sakalaneetisammatamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86


మ.

మనుజాధీశ్వరుకంటె మంత్రి బలసామర్థ్యంబు నర్థంబు రా
జ్యనియోగంబును నగ్గలం బగుచు నాజ్ఞాలంఘనోద్యుక్తుఁడై
మను దుష్టవ్యవసాయుఁ డే మఱి మదోన్మత్తాత్ముఁడై కూలు గ్ర
క్కున ము న్నాతనిచేఁ దదీశుఁడు నదీకూలావనీజాకృతిన్.

ముద్రామాత్యము కేవలము నీతిగ్రంథము కాక ముద్రారాక్షసమువలె నొకరాజు ప్రాభవమును సంపాదించు మంత్రిశిఖామణి నీతిదౌరంధర్యమును వర్ణించుకావ్యమో యనుసందియము గలిగించుచున్నది. ఇందు రాజరాజవంశజు లగుచోళభూపతుల జయించిన చాళుక్యరాజులయో లేక చాళుక్యుల జయించిన కాకతీయులయో పరాక్రమము ప్రశంసింపఁబడిన ట్టుదాహృతపద్యములవలన నూహింపదగియున్నది.

ఆ.

రాజరాజవంశభూజనపతు లీల్గి, రకట మంత్రి దొలఁగి యలికినాఁడు
ఏది పనుపు సేయ నిటు నిల్వఁబోలదు, రాజు లేనికయ్య మోజపడునె.

927


ఉ.

కొన్నిదినంబు లిక్కడ నకుంఠితలీలఁ బథశ్రమార్తియై
యున్నబలంబు గెల్చుకొను టొప్పగు నంతియ కాదు శత్రుభూ
మి న్నిజమార్గ మారయక మిన్నక యేఁగుట యేది బుద్ధి యా
యున్నెడఁ జూచి వెళ్లుజను లున్నర (?) చెప్పుఁడు గూఢచారతన్.

852

ఇవి కథాభాగములో పద్యములట్లు గాన్పించును గాని కేవలము నీతివిచారములు గావు.

నీతిసారమును మొదటికాకతీయరుద్రదేవుఁడు రచించినట్లు ప్రాచీనపద్యోదాహరణములు గలవు. ఉషాపరిణయ మనుసంస్కృతనాటకము రుద్రదేవకృత మని యొకటి గలదు కాని యక్కవి కాకతీయుఁడా యనుట విశదము కాదయ్యె. సంస్కృతభాషలోఁ గామందకనీతిసారము, శుక్రనీతిసారము అని ప్రసిద్ధములుగా రెండు నిబంధనములు గలవు. సింగన యుదాహరించిన నీతిసారపద్యములకు మూల మారెంటను గానరాదు. బార్హస్పత్యనీతిసార మని మూఁడువేలశ్లోకములలో నొకటి యుండినట్లు వైశంపాయనకృతివ్యాఖ్యాతయు యామళాష్టకతంత్రకారుఁడుసు బేర్కొనుచున్నందునను వీరమిత్రోదయాదిగ్రంథములలోని బృహస్పతిమతనీతియె మననీతిసారపద్యములఁ గానవచ్చుచున్నందున రుద్రదేవుఁడు బార్హస్పత్యనీతిసారమునె తెనిఁగించె నని సందేహము గలుగుచున్నది.