పుట:Sakalaneetisammatamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఈ రీతి నడువనేరని
భూరమణుఁడు శత్రువులు ప్రబోధత నుండన్
వారక నిద్రించినవాఁ
డారయ మేల్కొనఁగనేరఁ డాజన్మమునన్. 399

ముద్రామాత్యము

సేనాపతిలక్షణము

క. నానావితరణవిజయము
హానిపుణు లవార్యవీర్యు లనఁదగువారిన్
సేనాధ్యక్షులఁ జెసితె
నీనమ్మినవారి మాననీయుల హితులన్. 400

సభాపర్వము


సీ. సత్కులుఁ డౌదార్యసంపన్నుఁ డభిమాని
సత్యవంతుఁడు మేటి సత్యధనుఁడు
మంత్రజ్ఞుఁ డుత్సాహమంత్రసమ్మతుఁ డాగ
మజ్ఞుండు శుభమూర్తి మహితకీర్తి
బహుబంధుమిత్రసద్భటసమగ్రుఁడు
పతికార్యదక్షుఁడు యుద్ధకౌశలుండు
+ + + + + + + + + ++ + + +
+ + ++ + + + + + + + + + +
గీ. + + ++ + + + + + + + + +
+ + ++ + + + + + + + + +
నైన దళవాయి నేలిన యతఁడు రాజు
ఘనకళాభోజ యబ్బయకందరాజ. 401

చాటువు


మ. నయవిజ్ఞానముఁ దత్ప్రయోగములు నానావాహనారోహణ
క్రియతో నాయుధకౌశలంబు నుచితక్రీడారణామర్ష మెం
తయు నాయాససహత్వముం బరబలాంతస్సారవేదిత్వమున్
జయశీలత్వము గల్గు సైన్యపతి రాజప్రీతిపాత్రం బగున్. 402

సీ. మహిమ లేకుండిన మన్మథపరుఁడైనఁ
గ్రొవ్వినఁ బనిలేక కోపి యైన
నుచిత మెఱుంగకయున్న నిస్పృహుఁ డయ్యుఁ
బరుసగా భృత్యుల బలుకునేని
మృగయాదిసక్తుఁడై మెలఁగిన నాజన్మ
హీనుఁడై మాఱు సహింపకున్న
మొనలు దీర్పఁగ వాని ముంగలి నడిపింప
నేరఁడేఁ దనయిచ్చ నిగుడఁడేని
ఆ. నదను నెఱుఁగఁడేని నట్టి సేనాపతి
కొని జయంబుకలనఁ గొందు ననుచుఁ
గుక్కతోఁకఁ బట్టుకొని మహాంబుధి
దాఁటఁ దలఁచినట్ల కాదె ధరణిపతికి. 403

నీతిసారము