చ. జనపతి చారరక్షుఁ డయి చాలఁగ రంధ్రము రోసి శత్రుపైఁ
జని గెలువంగఁబోలుఁ జరచక్షుఁడు గాని నృపాలుఁ డంధుఁ డౌ
ననిశము శత్రుసంప దుదయంబును సర్వదశావిచేష్టలుం
గనుఁగొను బొప్పు శత్రుజనకల్పితకృత్యము చారదృష్టియై. 391
కామందకము
క. పసదన మెఱింగి చారుఁడు
వెసతో నేతెంచుఁ గాన వేమాఱును నా
పసదనమును జీతంబును
బొసఁగిన క్రియ నిడఁగవలయు భూపతివృత్తిన్. 392
ఆ. చరులు లేనిరాజు పరులచే నాపదఁ
జెందు ననుట యేమిచిత్ర మరయ
భక్తి సేయునట్టి ప్రజలైన నెఱుగమి
సూచి మోసపుచ్చ జూతురనిన. 393
పంచతంత్రి
ఉ. కొందఱ నారయంగ విడి క్రుమ్మఱి వచ్చుచుఁ బోవుచుండగా
గొందఱఁబంచి వేడ్కయును గొందఱ నొండొరుపోక గానకుం
డం దగఁ బంచి చారులు బెడంగుగఁ జెప్పినచోట మువ్వురే
చందము సమ్మతించి రది చందముగాఁ గొనిపోవఁగాఁ దగున్. 394
నీతిసారము
ఆ. హృదయకమలమందు నెద్దారిపగయైనఁ
జారగూఢమంత్రశక్తిఁ జేసి
తమకుఁ బూని గెలువఁ దఱియైనయంతకు
నది సహించికొందు రమలమతులు. 395
క. నానాదేశంబులఁగల
భూనాథుల శత్రుమిత్రబంధువులందున్
గానంబడు బహువిధముల
మానుగ వైదేశికులఁ గ్రమంబున నడుగన్. 396
ఉ. చేరి తలంటువారలను జెచ్చెర నాపదగాత్రమర్దనుల్
నారయ భోజనాంబుకుసుమాంబరభూషణగంధదాయకుల్
వారక వీ డె మిచ్చి చనువారును నిత్యసమీపవర్తనుల్
దారుణచిత్తవృత్తి రసదాయకు లౌదురు చేయనేర్చినన్. 397
క. పరఁగ నణుమాత్రరంధ్రం
బరిపక్షమునందుఁ గన్న నది మార్గముగాఁ
బరిమార్పవలయు రాజ్యము
పరువడి సలిలంబు యానపాత్రముఁ బోలెన్. 398