పుట:Rangun Rowdy Drama.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

రంగూన్‌రౌడీ.

     నను బట్టఁగాఁ దలంచిన రమేశుని నాదు
                      భయదశతఘ్నికిఁ బాలొనర్చి

     వెంటఁ దవిలిన పోలీసు వితతి నెల్ల
     లెక్కకును మిన్నయగు వారి నుక్కడంచి
     యిపుడు లక్షాధికారినై యిందుఁ జేరి
     నట్టి ననుఁ బట్ట దేవుని యబ్బతరమె ?

ఆనాఁడు పోలీసుభటులను హతమార్చిన సందర్భమున నాతుపాకిలోని గుండ్లన్నియు సంపూర్తి నొందుటచేత దుర్మార్గుఁడగు నామామ బ్రదికిపోయె. ఊఁ. ఐననేమి ! ఎప్పుడో యొకనాడు వాఁడుమాత్రము నాతుపాకిదెబ్బకు హతముగాక పోవునా? నే నీవిజయనగరంబున, వేషభాషల నన్నిటినిఁ బరిపూర్ణముగా మార్చుకొనియున్న వార్తను గ్రహింపఁగల ఘనుఁడెవ్వఁడు? ఒకవేళ నెవ్వఁడైన నున్నను, వాఁడుగూడ చచ్చినవారింజూడఁబోవఁడా ! ఈశంకరరావు నెదుర్కొన నెవ్వరికి గుండె లున్నవి! ప్రభావతియొక్క తె నాచర్యల నిప్పుడు కంటగించుకొనుచున్నట్లున్నది. కంటగించి యీయాఁడుముండ శంకరరావు నేమిచేయఁగలదు? ఏడ్చి ఏడ్చి చచ్చుఁగాక. నాస్వేచ్ఛను దీనికొఱకై చంపుకొందునా ! ఇష్టమువచ్చిన కాంతలతో నానందము ననుభవింపకుండ నా కిదియొకయాటంకమా! (విని) అదిగో! ఇక్కడికే వచ్చుచున్న ట్లున్నది ! రానిమ్ము. ఈలోన కొంచెము సురాపాన మొనరింతును. ( త్రాగుచుండును.)

[ప్రభావతి - ప్రవేశించును.]

ప్రభా - (చూచి స్వగతము) ఛీ! ఏమి యీరాక్షసప్రకృతి! ఇరువదినాలుగుగంటలును సురాపానము దక్క. వేఱొకవృత్తియే కనుపడదే! ఈ నికృష్టునినైజ మెఱుంగలేక, యెంతపొరపడి గృహత్యాగమొనరించి వచ్చితిని! (వేఱొకయాసనముపై విముఖియై కూర్చుండును.)