పుట:Rangun Rowdy Drama.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము.

67

శంక — ఓహో! ఏమి మాదురదృష్టము ? మాప్రభావతీరాణిగారికినేఁడు సంపూర్ణాగ్రహము గలిగిన ట్లున్నదే?

ప్రభా - నీకు నాయాగ్రహముతో పనియేమి ? అనుగ్రహముతో పనియేమి? నావంటిరాణులు నీకు వేనవేలు గలరు.

శంక - (వికటహాసము చేసి) ఓ హో ! ఇదియా కథ ! నిన్ను వదలి నే - నితరస్త్రీలతోఁ బోవుచుంటినని యీర్ష్యయా? ప్రభావతీ! నీవు నాకు తాళిగట్టినభార్యవును, వారు కానివారునా ! అందఱు నొక్కటే. అందుల కీకడుపుమంటయేల !

ప్రభా - తాళిగట్టినభార్య నింతకన్న సుఖపెట్టి యేడ్చితివా యేమి ?

శంక - (పెద్దగా నవ్వి) అద్దీ సంగతి! నిజము గ్రహించితివి. స్వంతభార్యయే నాకు లెక్క లేనపుడు, నీవంటిసానులను లెక్కింతునా !

ప్రభా - (రోషముతో లేచి) ఛీ! దుర్మార్గుఁడా! ఏమిరా! ప్రేలితివి. నేను సాని నటరా!

శంక - సానివిగాక పతివ్రతవా యేమి! మగని విడచి, యితరపురుషుని మరగి యిల్లు విడిచివచ్చినఱంకులాడికిని సానికిని భేద మేమి ?

ప్రభా — (విచారరోషములతో తల మోదుకొని) హా ! హా !! ఎట్టి దుర్మార్గుని విశ్వసించి ధనమాన ప్రాణము లర్పించి, గృహత్యాగినినై యెట్టి నిందావాక్యములను సహింపవలసివచ్చెను ? దుర్భరము ! దుర్భరము ! భరింపఁజాల ! (రోషముతో) ఓరీ ! దుర్మార్గుఁడా ! కులభ్రష్టుఁడా ! హంతకుఁడా ! నాసంసారచ్ఛేదముఁ గావించి, న న్నధఃపతితురాలి నొనరించినది చాలక యెట్టిదుర్భాషలాడ సాహసించితివిరా చెనటీ!

సీ. మరణింపనున్న ని న్నరసి రక్షించి నా
                 యిలుజేర్చినందుల కిదిఫలంబ ?