పుట:Rangun Rowdy Drama.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము.

33

     అంబర మంటు బౌద్ధాలయశిఖరంబు
                 హేమప్రదీప్తి వహించుచుండ
     నారాయణుని దివ్యనవమావతారమౌ
                 బుద్ధదేవుడు శాంతమూర్తినుండ
     అప్సరస్సౌందర్య మరసి యోడించు బ
                 ర్మాస్త్రీలు నేత్రపర్వంబు సేయ

     నిచటి సౌధపంక్తి యిచ్చటి సుందరో
     ద్యానవితతీ నెందుఁగానఁబోము;
     రమ్యవిజితసురపురంబైన రంగూను
     పురముసాటి వేఱపురము లరుదు ?

ప్రభా - ఆమహాసముద్రమునం దానాఁడు మొసలివాతనుండి మీరు మరణించియుండినచో నిజముగా దేవేంద్రునగరమునే చూచి యుందురు. కాని, తలవెండ్రుకంతయదృష్టరేఖ తలసూపుట చేత భూతలదేవేంద్రనగరమునకు వచ్చు పుణ్య మబ్బినది.

శంక - చావనున్న నన్ను బ్రదికించిన మాసతీపతు లిర్వురకును జన్మాంతము నేను కృతజ్ఞుడనై యుందును. దాని నట్లుండనిండు. ఆ నాఁటివిషయమును మిమ్మడుగుటయే మఱచితిని. ఆ చిన్న నావపై తమరు కాకినాడ రేవునకు వచ్చుచుండినకారణమేమి?

ప్రభా -- నాభర్తగారైన రమేశబాబుగా రీరంగూన్ పట్టణమున నొక లక్షాధికారియగు వర్తకు లనుసంగతిని తెలిసికొంటిరిగదా! మీ కోరంగిజాతివాఁడొకఁడు రంగూనులో బాకీచేసి కాకినాడ సమీపముననున్న తాళ్ళరేవున తల దాచుకొనెననువార్త నెఱింగి, స్వయముగ నాభర్తగారేవచ్చిరి. అదృష్టవశమున బాకీదారుఁడు దొరికెను. చిన్నప్పటినుండియు, నా నాధునకు చేపలవేట ప్రియ మైనదగుటచేత చిన్ననావపై వేటాడుచు, మేమచ్చటికివచ్చితిమి.