పుట:Rangun Rowdy Drama.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

రంగూన్‌రౌడీ.

శంక - ఆహా ! భగవత్సంకల్ప మెంత చిత్రమైనది ! ఇంతకును అదియొక హేతువయ్యెనుగాని, నాయాయుర్దాయబలమువలన భగవంతుండే మిమ్మచటికిఁ బంపెను. సరిగాని, మీరిప్పుడు 'మీకోరంగిజాతివాఁ'డని ఏమో పలికితిరి. కోరంగిజాతియనఁగా నేమి?

ప్రభా - మీరు కోరంగిజాతివారుకారా ?

శంక - "కోరంగిజాతి" యను నొక జాలి కలదా ?

ప్రభా - ఆహా ! కలదు. మీరే, “కోరంగిజాతి” వారు. మీజాతిపేరే మీకు తెలియదనిన నాకాశ్చర్యముగా నున్న దే ?

శంక - కోరంగి యేమో, జాతియేమో, నే నెఱుగను. మే మాంధ్ర జాతివారము. కాదేని, తెలుఁగువారము.

ప్రభా - అది యేమోకాని, మీజాతివారిని బర్మాదేశమునందు కోరంగి జాతివారనియే పిలుతురు. మిక్కిలి హీనముగాకూడచూచెదరు.

శంక - (ఆశ్చర్యముతో) భళీ ! ఇది కడువింతయైనమాట.

గీ. అకటకట ! పూజ్యమైనట్టి ఆంధ్రజాతి
    గౌరవము మాని “కోరంగి” వారటంచు
    హీనముగఁ బల్కువారె! రంగూనులోన
    నితరజాతులకంటికి హేళనముగ.

ప్రభావతీదేవీ ! మాజాతి కింతటి గౌరవహీనత గల్గుటకు కారణమేమో మీ రెఱుఁగుదురా?

ప్రభా - కారణములు కనఁబడుచునే యున్నవికాదా !

శంక - నా కేమియు కనఁబడుటలేదు. దయచేసి యెఱింగింపుఁడు.

పభా -

సీ. జనుల సందఱను కంచరగాడ్దెలట్లు మే
                  రకమోయువారు కోరంగివారు
    గౌరవవ్యాపారకార్యంబు సేయనే
                  రనికూలివారు కోరంగివారు