పుట:Rangun Rowdy Drama.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము.

17

రంగా - ఈశనిగొట్టుముండను సరిహద్దులలో నుండకుండ సాగనంపు మావలకు.

సేవ - ఓసీ! నడిచెదవా ? గెంటుదునా ?

గిరి - ప్రియా ! ప్రియా ! (ఏడ్చును.)

శంక - ఓరీ! సేవకా ! దానిని తాకితివా చూడు !

రంగా - (శంకరరావును చెంపపైఁ గొట్టి) అరే ఉల్లూ ! నోరుమూసికొని చచ్చిన ట్లుండు. సేవకా ! నీపని గానిమ్ము.

సేవ -- (గిరికుమారిని గెంటుకొనిపోవును.)

శంక - -ఓరీ ! ముసలీ ! నన్ను చెంపదెబ్బ కొట్టితివిగా ! ఇది మఱచిపోకు. గుండెలలో నుంచుకొనుము.

రంగా - నిషా దిగినదా ? మఱియొక చపేటము కావలెనా? (ఇల్లంతయు దిరిగి చూచుచుండును.)

శంక - వీఁడు బ్రతికియుండిన నిఁక నాబ్రతుకు వట్టిదే. వీనిని చంపి పవరునామా గ్రహించుటకన్న మార్గములేదు.

(తుపాకి ప్రేల్చగా రంగారావు మరణించును.)

సేవ — (ప్రవేశించి) ఎక్కడి దీతుపాకిచప్పుడు ! (చూచి) హా ! రంగారావుగారిని ఖూనీచేసినాఁడు. (నిష్క్రమించును.)

శంక - ఐనది. ఎగిరిపడి - ఎగిరిపడి - పీనుఁగైనాఁడు, (పవరునామాను గ్రహించి దుస్తులను విప్పుచుండును.)

గంగారాం - [ప్రవేశించి- శంకరరావును పట్టుకొని] అరే! జల్లాద్ ! ఠైర్ ! జావ్ ! ఖూనీచేసి యెక్కడికి పారిపోవలె ననుకొన్నావు?

శంక - గంగారాం ! ఖూనీ చేసితిని. నిజమే. కాని, గోలచేసి నన్ను నడివీథినిఁ బెట్టి సర్కారున కప్పగించిన నీ కేమిలాభము ? నీకు కొంతధన మిచ్చెదను. సంతోషముతో వెడలిపొమ్ము.